మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్రంలో నరేంద్రమోడీ సారధ్యంలో ఏర్పడిన కొత్త మంత్రి వర్గంలో తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపిలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన జి.కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపిగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో విజేతగా నిలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా, బిజెపి నుంచి నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.