హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. నోటీసుల్లో కెటిఆర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని అన్నారు. కెటిఆర్ పేరును తానెక్కడా ప్రస్తావించలేదన్నారు. తన లీగల్ నోటీసులను కెటిఆర్ వెనక్కి తీసుకోవాలన్నారు. రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమన్నారు. ఏడు రోజుల్లో కెటిఆర్ తన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కెటిఆర్ నోటీసులకు బదులిచ్చాను..తిరిగి తాను కూడా నోటీసులిస్తానని బండి సంజయ్ తెలిపారు.
కెటిఆర్ బావమరిది మందు దందాలో దొరికితే…బిఆర్ఎస్ నేతలు ధర్నా చేయడమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. కెసిఆర్ లేకపోతే కెటిఆర్ ను ఎవరూ పట్టించుకోరన్నారు. బిజెపి మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే పేదల జోలికి వస్తే ఊరుకోబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు వెంటబడతామన్నారు. బిఆర్ఎస్ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తామని అన్నారు.