హైదారాబాద్: కర్నాటకను వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ఎటిఎంలా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోంటోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం ఆరోపించారు. కర్నాటకలోని ములబగిలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన బిజెపి తరఫున ప్రచారం చేస్తూ ఈ ఆరోపణ చేశారు. ఒకవేళ కర్నాటకలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలను లూటీ చేస్తుందని, డబ్బు పిండుకుంటుందని ఆయన అన్నారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కర్నాటకను కాంగ్రెస్ ఎటిఎంలా ఉపయోగించుకుని డబ్బు పొందుతోంది’ అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్, జనతాదళ్(ఎస్) మధ్య రహస్య అవగాహన ఉందని కూడా బండి సంజయ్ ఆరోపించారు. ‘ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో అక్కడ జెడి(ఎస్) బలహీన అభ్యర్థిని నిలబెడుతోంది. అలాగే జెడి(ఎస్) బలంగా ఉన్న చోట కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెడుతోంది. ఈ రెండు పార్టీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నుంచి నిధులు అందుతున్నాయి’ అని ఆయన తెలిపారు.
కర్నాటకలో గత 70 ఏళ్లలో కాంగ్రెస్, జెడి(ఎస్) ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని బండి సంజయ్ అన్నారు. కర్నాటకలో అభివృద్ధి అంతా బిజెపి పాలనలోనే జరిగిందన్నారు. హైదరాబాద్‌లో మజ్లీస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నది ఒక్క బిజెపి పార్టీ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. హిందు ధర్మాన్ని కాపాడే ఒకే ఒక్క పార్టీ బిజెపి అని బండి సంజయ్ అన్నారు. టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను చేసుకునే పార్టీలను ఓటర్లు తరిమేయాలని అన్నారు.
దీనికి ముందు బండి సంజయ్ బెంగళూరు శివార్లలో ఉన్న ఎలహంకలో బిజెపి తరఫున ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ‘బిజెపి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో బిజెపి చేసిన మంచిపనులు, కేంద్రంలో మోడీ చేసిన మంచిపనుల గురించి వివరించాలి’ అన్నారు.