Friday, December 20, 2024

వాస్తవాలను ప్రజల ముందుంచాలి : బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బిఆర్‌ఎస్ పాలనలో సాధించిన ప్రగతిపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. తెలంగాణ తెచ్చుకున్న సంబురం కూడా లేకుండా సకల జనులను దగా చేసినందుకు పండుగ చేసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లలో చెప్పేదొకటి.. చేసిందొకటి.. రోజుకో పండుగ చొప్పున 21 రోజులుపాటు సంబురాలు చేసుకుందామనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిజాలు జనం ముందుంచాలని కోరుతున్నాను.

తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తానన్న ప్రకటన ఏమైంది?, ఎదురించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు జరిగాయని బాధితులు కేసులు పెడితే.. వారిపైనే తిరిగి కేసులు పెట్టి లోపలేసుడు. ప్రతిపక్షాలు, విద్యార్థి నేతలపై జులుం చూపించుడే ఫ్రెండ్లీ పోలీసా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్ని పరిశ్రమలు తెచ్చినం.. ఇన్ని ఉద్యోగాలిస్తున్నం అని చెప్పుకుంటున్నారు తప్పితే… మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ప్రగతే. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ఏడో స్థానంలో ఎందుకుందని ప్రశ్నించారు.

కృష్ణా నీళ్లను ఎపి ఎత్తుకుపోతుంటే.. ఎందుకు అడ్డుకోలేదు. జంట జలాశయాల ఉనికికే ప్రమాదం తెచ్చేలా 111 జీవోను రద్దు చేసింది.. ఎవరి భూముల కోసం? అని ప్రశ్నించారు. అడవులను నరికి.. అక్కడే మొక్కలు నాటడమే హరితహారం లక్షమా అంటూ విమర్శించారు. అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో ఆ అమరులనే విస్మరించారు. వారి కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. ముఖ్యమంత్రి.. ఇప్పటికైనా మీరు వాస్తవాలను ప్రజల ముందుంచాలి. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో మీకు భంగపాటు తప్పదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News