మన తెలంగాణ/హైదరాబాద్: ఈనెలాఖరున ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఈసారి ముథోల్ నియోజకవర్గంలోని బాసర ప్రాంతం నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. బిజెపి పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, త్వరలో పాదయాత్ర ప్రారంభ తేదీలను ప్రకటిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ఏ పార్టీలు ఎంతమేర పోరాటం చేస్తున్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. బుధవారం బిజెపి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా బండి సంజయ్ మాట్లాడారు.. రాష్ట్రంలో సంస్థాగతంగా బిజెపి బలపడిందని, ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా తమ పార్టీ ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలో పోటీ చేసేందుకు పార్టీ సీనియర్లు సిద్ధంగా ఉన్నారని, అయితే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గానికి లక్ష ఓట్లను సాధించడమే తమ లక్షమన్నారు. అందరి నాయకులను గౌరవించే సంస్కృతి బిజెపిదని అన్నారు.
ఎక్కడో ఇంట్లో కూర్చున స్వామిగౌడ్ లాంటి నాయకుడిని గౌరవించి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఆయన టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారని విమర్శించారు. ఆయన ఏమి ఆశించి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళారో స్వామిగౌడ విజ్ఞతకే వదిలివేస్తున్నామని తెలిపారు. నిర్మల జిల్లా నాయకుడు, హిందుత్వ వాది రామరావు పటేల్ బిజెపిలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. బైంసా అల్లర్లలో బాధితుల పక్షాన రామారావు పటేల్ నిలిచారన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సింగిల్ గానే పోటీ చేస్తుందని, జనసేన పార్టీతో పొత్తుపెట్టుకోబోదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నేతలు ఇతర పార్టీలకు అమ్ముడుపోతున్నారని ఆయన విమర్శించారు. కోవర్డు రాజకీయ నాయకులను గల్లాపెట్టి గుంజాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ పార్టీలో నాయకులైనా సరే తల్లిలాంటి పార్టీకి కోవర్టు రాజకీయతో ద్రోహం చేయకూడదని ఆయన హితవు పలికారు. బిజెపి ఎంఎల్ ఎలు టిఆర్‌ఎస్ చేరబోతున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మునుగోడు గెలుపోటమిలతో కుంగిపోలేదని, ఉత్సాహంతో బిజెపి కార్యకర్తలు పని చేస్తున్నారని ఆయన తెలిపారు.
Bandi’s 5th ‘Praja Sangrama Yatra’ to begin from Nov last week