తానా మహాసభల్లో గొడవపై బండ్ల గణేశ్ ఫైర్
హైదరాబాద్: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) 23వ మహాసభల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ సైతం స్పందించారు. తానా పరువు తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తానాను నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచులారా’ అంటూ బండ్ల గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఈ సభలకు వచ్చిన వారు తమకు భోజనం అందలేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి ఎన్‌ఆర్‌ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో….
టిడిపి ఎన్‌ఆర్‌ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ జై ఎన్టీఆర్ నినాదం తీసుకురావడంతోనే లోకేష్ అభిమానులు గొడవకు దిగారని, ఈ క్రమంలో తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయని పోస్టు చేసింది. పిడిగుద్దులు గుద్దుకుంటూ రచ్చ చేశారని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనపై బండ్ల గణేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అవి మరింత దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీతక్క పలువురు హాజరయ్యారు.
పరస్పరం కొట్టుకోవడం దుమారం రేపింది
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 7, 8, 9 తేదీల్లో జరిగిన ఈ సభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ సభలో పలువురు పరస్పరం కొట్టుకోవడం దుమారం రేపింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.