చెన్నై: ఐపిఎల్ సీజన్14లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు రెండు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడించింది. 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరికి బెంగళూరు జయకేతనం ఎగుర వేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (33), గ్లెన్ మాక్స్‌వెల్ (39) అద్భుత బ్యాటింగ్‌తో బెంగళూరును ఆదుకున్నారు. చివరల్లో ఎబి డివిలియర్స్ 27 బంతుల్లో రెండు సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేయడంతో బెంగళూరు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆదుకున్న సూర్య, లీన్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆరంభంలో సిరాజ్, జెమీసన్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ముంబై స్కోరు నెమ్మదిగా ముందుకు సాగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లో ఒక ఫోర్, సిక్సర్‌తో 19 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో ముండై 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను క్రిస్ లీన్ తనపై వేసుకున్నాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ తోడయ్యాడు. ఇద్దరు బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరు పోటీ పడి షాట్లు కొట్టడంతో స్కోరు వేగం పుంజుకుంది.
ఈ జంటను విడగొట్టేందుకు బెంగళూరు బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్య చెలాయించిన వీరిద్దరూ స్కోరును పరిగెత్తించారు. ఇదే క్రమంలో ముంబై స్కోరు 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులకు చేరింది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జెమీసన్ విడదీశాడు. 23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు చేసిన సూర్యకుమార్‌ను అతను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 70 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే లీన్ కూడా వెనుదిరిగాడు. ధాటిగా ఆడిన లీన్ 35 బంతుల్లోనే మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 49 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
హర్షల్ మ్యాజిక్..
ఆ తర్వాత ముంబై ఇండియన్స్ వరస క్రమంలో వికెట్లను కోల్పోయింది. బెంగళూరు బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో ముంబై వేగంగా పరుగులు చేయలేక పోయింది. ఇక స్కోరును పెంచే క్రమంలో ఇషాన్ కిషన్ (28), హార్దిక్ పాండ్య (13) ఔటయ్యారు. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన కీరన్ పొలార్డ్ (7), కృనాల్ పాండ్య (7) కూడా నిరాశ పరిచారు. ఆఖరి ఓవర్‌లో హర్షల్ పటేల్ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ముంబై ఆశించిన స్థాయిలో స్కోరును సాధించలేక పోయింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.