Tuesday, December 24, 2024

నిండా నీటమునిగిన బెంగళూరు

- Advertisement -
- Advertisement -

Bangalore city is now completely submerged in water

చెరువులను తలపిస్తున్న రహదారులు
నీట మునిగిన వేలాది వాహనాలు
ట్రాక్టర్లు, బుల్‌డోజర్లపై కార్యాలయాలకు ఉద్యోగులు
స్కూళ్లకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు
ఐటి ఉద్యోగుల ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’కు కంపెనీల అనుమతి
గత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన ఫలితమే: సిఎం బొమ్మై

బెంగళూరు: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు, పొంగిపొర్లుతున్న నాలాలతో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకొనే బెంగళూరు నగరం ఇప్పుడు పూర్తిగా నీట మునిగింది. మూడు రోజులు గడుస్తున్నా సగం నగరం ఇంకా నీటిలోనే చిక్కుకుని ఉండడంతో తాగు నీరు, విద్యుత్ కొరతతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. నగరంలోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించగా ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పని చేయాలని కోరాయి. సెలవులు లేని కార్యాలయాల ఉద్యోగులు ట్రాక్టర్లు, బుల్‌డోజర్లు లాంటి వాటిపై విధులకు వెళుతున్నారు. సోమవారం మరోసారి భారీ వర్షం కురవడంతో నగరవాసుల కష్టాలు మరింత పెరిగాయి.

నగరంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ నీట మునిగే ఉన్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలతో వెళ్తూ మధ్యలో ఆగిపోయి అవస్థలు పడుతూ ఉండడం, పాదచారులు మోకాటి లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లలేక అవస్థలు పడుతూ ఉన్న దృశ్యాలు నగరంలో ఎక్కడ చూసినా కనిసిస్తున్నాయి. సహాయక చర్యల కోసం ప్రభుత్వ అధికారులు, పడవలను, ట్రాక్టర్లను రంగంలోకి దించారు. అపార్ట్‌మెంట్లు, భారీ భవనాల బేస్‌మెంట్లలో , ఇళ్ల ముందు పార్క్ చేసిన వందలాది వాహనాలు నీట మునిగాయి. ప్రధానంగా ఐటి కంపెనీలు ఉన్న ఒఆర్‌ఆర్, సర్జాపూర్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జనం ట్రాక్టర్లపై తమ గమ్యసానాలకు వెళుతున్న దృశ్యాలు సర్వ సాధారణమైనాయి.

బైక్ స్కిడ్ అయి, కరెంటు స్తంభం పట్టుకొని..

సిద్దాపూర్‌లో వరద నీటితో నిండిన రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న 23 ఏళ్ల మహిళ బైక్ స్కిడ్ కావడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. సోమవారం రాత్రిఆమె డ్యూటీనుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సోమవారం మరోసారి భారీ వర్షం కురవడంతో నగరప్రజల కష్టాలు మరింత పెరిగాయి. కాగా ఈ నెల 9వ తేదీ వరకు నగరంలో పాటు కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించంది.

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనవల్లే: బొమ్మై

మరో వైపు సహాయక చర్యల వైఫల్యంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో వీటిపై రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ స్పందించారు. ‘ బెంగళూరు వర్షాలు, వరదలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది వాస్తవ పరిస్థితి. దాన్ని దాచిపెట్టలేం. అయితే ఈ స్థితికి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు ఓ కారణమయితే,నగరం ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా కారణమే’ అని బొమ్మై విమర్శించారు. ‘ నగరం ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం గత ప్రభుత్వం తీరే. తలా తోకా లేకుండా పాలించారు వాళ్లు. ఎటుపడితే అటు కట్టడాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. చెరువుల నిర్వహణను ఏ నాడూ పట్టించుకోలేదు.పైగా అవినీతితో చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు.అందుకే నగరం ఇప్పుడు నీట మునిగింది. అయినప్పటికీ ఆటంకాలను దాటుకుని ఎలాగైనా నగరంలో ని పరిస్థితులను పునరుద్ధరిస్తాం.

అలాగే మునుముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడతాం’ అని ముఖ్యమంత్రి మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. కర్నాటక ముఖ్యంగా బెంగళూరులో ఈ తరహా వానలు మునుపెన్నడూ కురవలేదని, గత 90 ఏళ్లలో రికార్డుస్థాయి వర్షాలు కురవడం ఇదే తొలిసారని అన్నారు. నగరంలో కనీసం 164 చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. బెంగళూరు వరదలను చాలెంజ్‌గా తీసుకుని అధికారులు,స్టేట్ డిజాస్టర్ రెస్సాన్స్ బృందాలు నిరంతరం పని చేస్తున్నారని ఆయన తెలిపారు. పరిస్థితులు చక్కబడగానే అక్రమ కట్టడాలను తొలగిస్తామన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బెంగళూరు వరదల విషయంలో ప్రభుత్వందే తప్పని విమర్శిస్తోంది. ఈ మేరకు నడుంలోతు వరద నీళ్లలోనే నిలబడి నిరసనలు తెలుపుతున్నారు ఆ పార్టీ నేతలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News