రాణించిన మ్యాక్స్‌వెల్, చాహల్
కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై 6 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం
షార్జా: పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు అవిరయ్యాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో కీలకమైన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పంజాబ్ ఓడిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ విజయంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు పంజాబ్ పేఆ్లఫ్‌కు చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించడంతో పాటు మిగతా మ్యాచ్‌ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు జట్టు నిర్దేశించిన 165 పరుగుల లక్షాన్ని ఛేదించడంతో పంజాబ్ జట్టు విఫలమైంది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం (57)తో రాణించినా పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. కెప్టెన్ కెఎల్ రాహుల్ (39), మార్‌క్రమ్(20) లు కూడా పర్వాలేదనిపించారు. ఫారుక్ ఖాన్(16) చివరి ఓవర్‌లో రనౌట్ కావడం పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లిందని చెప్పవచ్చు. నికోలస్ పూరన్( 3), సర్ఫరాజ్(0)లు విఫలం కావడం కూడా ఆ జట్టును దెబ్బతీసింది. ఒక దశలో పది ఓవర్లు ముగిసే సరికి 80 పరుగులతో పంజాబ్ జట్టు గెలుపు ఖాయమనే స్థితిలో నిలిచింది. ఈ పరిస్థితిలో రాహుల్‌ను అవుట్ చేసిన షాబాజ్ అహ్మద్ బెంగళూరు జట్టుకు కీలక బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో చివర్లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ జోరుగా పరుగులు సాధించలేక పోయారు. బెంగళూరు బౌలరల్లో యజువేంద్ర చాహల్ మరోసారి అద్భుత ప్రదర్శనతో కేవలం 29 పరుగులకే మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. షాబాజ్ అహ్మద్, గార్టన్ చెరో వికెట్ తీశారు.
రాణించిన మ్యాక్స్‌వెల్
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ (25), దేవదత్ పడిక్కల్ (40)శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి పవర్ ప్లే లో 55 పరుగులు జోడించారు. వీరికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కోహ్లీని స్టంపింగ్ చేసే అవకాశాన్ని రాహుల్ జార విడచగా, అంపైర్ పొరబాటు నిర్ణయం కారణంగా పడిక్కల్ ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. అయితే హెన్రిక్ బౌలింగ్‌కు దిగడంతో పరిస్థితి మారిపోయింది. హెన్రిక్ నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులివ్వడమే కాకుండా కోహ్లీ, పడిక్కల్‌తో పాటుగా డేన్ క్రిస్టీన్‌ను కూడా ఔట్ చేయడంతో బెంగళూరు ఇబ్బందిలో పడింది. అయితే మ్యాక్స్‌వెల్, చివర్లో డివిలియర్స్ చెలరేగడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కో సాధించింది. మ్యాక్స్‌వెల్ కేవలం 33 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, మరో మూడు బౌండరీలతో 57 పరుగులు చేయగా, డివిలియర్స్ 23 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, హెన్రిక్‌లు చెరి 3 వికెట్లు పడగట్టారు.