విభిన్నమైన వస్తువుతో కవిత వస్తే అది సగం విజయం సాధించినట్లు లెక్క. కొత్త భావాలతో రాసినా అది కూడా పాఠకుడిని ఆకట్టుకుంటుంది. భాషలో కొత్తదనం ఉన్నా కూడా పాఠకుడిని ఆకట్టుకోవచ్చు. అటువస్తువులోనూ, భావములోనూ, భాషలోనూ కొత్తదనాన్ని చూపినప్పుడు ఆ కవిత చాలాకాలం నిలబడుతుంది. ఆ కవిత రాసిన కవి, పాఠకుడికి ఎప్పుడూ దూరం కాడు. ఆ స్థాయికి కవి వెళ్లాలంటే,లో లోపల కవికి తీవ్ర మధనం జరగాలి. అలాంటి సంఘర్షణతో, మధనంతో, వేదనతో కవిత్వం రాస్తున్న బంగార్రాజు, ఇటు వస్తువులోనూ, భాషలోనూ, భావములోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికి మూడు కవితా సంపుటాలు వెలువరించారు. ఇంకా రెండు మూడు కవిత సంపుటాలకు సరిపడా కవితలు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే గత మూడు కవిత సంపుటాలతో పోలిస్తే ఇప్పుడు బంగార్రాజు, ఒక పరిపక్వ దశకు చేరుకున్నారు.
ఆధునిక మోహావేశాలు మనిషిని అన్ని దిశలు చుట్టుముట్టాక, కాదు ఈ వాక్యాన్ని వేరే రకంగా చెప్పుకుందాం. మనిషి ఆధునిక వ్యామోహ వలలోకి తనకు తానే వెళ్లిపోయిన దశలో మనం ఉన్నాము.
మన చుట్టూ వాతావరణ కాలుష్యంతో పాటు డిజిటల్ కాలుష్యం విపరీతంగా విస్తరిస్తోంది. ఇప్పుడు పెద్దగా ఏమీ రహస్యాలు ఉండవు. అంతా బట్టబయలు. అలాంటి సందర్భంలో వాస్తవ ప్రపంచాన్ని, భావోద్వేగాలతో తెలుసుకుంటూ, లోపలకి అన్వేషించుకోమని ఈ కవి ఒకటి రెండు మూడు అలా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. సమకాలీన రాజకీయ నిర్ణయాలను, మాయలను, కుట్రలను తీవ్రంగా చెప్పగలడు. తార్కికమైన ప్రశ్నలతో కవితను నడిపి, పాఠకుడిని చదివించగల, కదిలించ గల శక్తిని సంపాదించాడు. పద చిత్రాలు, భావచిత్రాలు జోలికి వెళ్లకుండా కవితని నడిపే టెక్నిక్ మనం గమనించవచ్చు. నిజాయితీతో కూడిన స్టేట్మెంట్ ద్వారా కూడా ఈ కవి అనుకున్న భావాన్ని పాఠకుడులోకి ప్రసారం చేయగలడు. ఈ కవితను పరిశీలించండి.‘నిన్న మొన్నటి వరకు/ నింగికెగిసిన కీర్తిపతాక/ ఇప్పుడు అచ్చం మాపుగుడ్డలా వుంది/ సూర్యుడు చంద్రుడు/ మేకప్పులు మార్చుకునేంతలోపు/ ఇక్కడ సన్నివేశాలు మారిపోతున్నాయి’ (ప్రజాశక్తి -జూలై 31, 2023)/ ఈ వాక్యాలతో కవితను మొదలుపెట్టిన కవి దేశంలో ఉన్న అభద్రత వాతావరణం, అలాగే మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా అక్కడ ఆడవాళ్ళపై జరుగుతున్న దాడులు గురించి మాట్లాడుతూ వెళ్తాడు.
కవిత లోపలికి వెళ్లే కొద్ది తార్కికమైన ప్రశ్నలతో ఆలోచింపజేసే విధంగా ముందుకు తీసుకునిపోవడం కనిపిస్తుంది. స్త్రీలు పూజించిన చోట దేవతలు ఉన్నట్టే, స్త్రీని హింసించిన దగ్గర దయ్యాలు ఉంటాయి కదా అని చెప్తూ ఇప్పుడీ దేశాన్ని దయ్యాల కొంప అనాలేమో అని చెప్తూ‘కంటిముందు కదలాడుతున్న/ దృశ్యరహస్యాల వెనక/ నిజానిజాల్లోని ఇజాఇజాలు/ ఎప్పటికీ బహిర్గత రహస్యాలు’/ అయితే ఇప్పుడు దేశం ఎలా ఉంది అనే ప్రశ్నకు కవి ముగింపు వాక్యాల్లో తన పరిశీలనను/ ఇలా చెప్తాడు./ రమారమీ/ రెండు వందల కోట్ల కన్నులు నుంచి/ కురుస్తున్న వానలు సాక్షిగా/ ఇప్పుడు దేశంలో దుఃఖం పుష్కలంగా పండుతుంది’/ వాస్తవానికి ఈ కవిత శీర్షిక ‘దుఃఖం పండుతున్న నేల;. ఈ శీర్షిక ద్వారానే కవి ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం అయిపోతుంది. అది అర్థం అయ్యాక మిగిలిన కవిత అంత వ్యాఖ్యానమే అని తెలుస్తుంది. ఈ కవికి స్పష్టమైన రాజకీయ దృక్పథం ఉంది. ఒక తీవ్రమైన సంవేదనతో కైకట్ట గలడు. దేశీయ ఫాసిజం అన్ని వైపుల నుండి జీవితాలను ప్రభావితం చేస్తున్న విషయాన్ని ఈ కవి ఎప్పుడూ కవిత్వం ద్వారా ప్రకటిస్తూనే ఉంటాడు.
రాస్తున్న కవిత సంఘటనాత్మకమైనా, కవిత్వం చేసిన తీరు మనల్ని అతని వాక్యాల దగ్గర కళ్లుపెట్టేలా చేస్తుంది. తానేం రాస్తున్నాడు తనకు స్పష్టత ఉంది, వస్తువు పట్ల ఎరుక ఉంది, తన కవిత్వానికి ఒక స్వభావాన్ని ఇస్తున్నాడు. ఏ కవితకు ఏ స్వరం కావాలో అది ఇస్తున్నాడు. ధిక్కారం పలకాల్సిన చోట ధిక్కారమే పలుకుతున్నాడు. వ్యంగ్యం అవసరమైన చోట అదే పలుకుతోంది. మానవీయ స్వరం వినపడాల్సిన చోట ఆ స్వరమే వినిపిస్తుంది. లొకేషన్ షేర్ చేయండి అనే కవితలో ప్రజాస్వామ్యం అమలు అయ్యే తీరును కవి వ్యంగ్యంగా చెప్తూనే, ఆలోచింప జేశాడు.తన కోసం తనచేత/ తనే ఏర్పాటు చేసుకున్న బతుకును/ఎదో అవసరంగా/ బానిసత్వం చప్పరిస్తున్నప్పుడు/ బడుగైన పిడుగైన/ ఏ మనోఫలకంపై చూసినా/ జింకను పులి వేటాడుతున్న సన్నివేశం అంటాడు. అసలు ఈ భూమి మీద అతిపెద్ద ప్రజాస్వామ్యం కనిపించడం లేదు లొకేషన్ షేర్ చేయండి అని ప్రకటన చేస్తాడు. ఈ కవి ప్రతి సామాజిక సంఘటన తనదైన కోణంలో నమోదు చేశాడు. 500 కు డబ్బాలో కుక్కపడ్డ బ్యాలెట్ పత్రం పేదల జీవితమని నిర్ధారణ చేస్తాడు. ప్రాణాలను లెక్కచేయక మద్యం సీసా కోసం ఎగబడ్డ దేశమని మరో సందర్భంలో అంటాడు.
బంగార్రాజు ఎన్.ఆర్.సి నేపథ్యంలో రాసిన ధ్రువీకరణ, నిర్ధారణ అనే కవితలు ఆ కోవలో వచ్చిన ఉత్తమ కవితలుగా నిలబడతాయి. సింధు మైదానం చాళ్లలో చల్లిన విత్తనాలు ఎవరివి, మొహంజాదారో మృతుల దిబ్బ మీద కూర్చోబెట్టిన పీనుగుల్లో నువ్వు ఉన్నావా, నాగరికత నిర్మాణానికి రాల్చిన చెమట చుక్కల్లో నీ భాగం ఎంత ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ, ఆ ప్రశ్నల్లో కూడా ఈ కవిత్వాన్ని మిస్ కానివ్వలేదు. పౌరసత్వ నిర్ధారణలో భాగంగా అసలు దేశానికి డిఎన్‌ఎ టెస్ట్ చేయాలని పిలుపునిస్తాడు. ఈ మూలవాసుల తల్లి బిడ్డల బంధం గురించి కొత్తగా ధ్రువీకరించుకోవలసిన అవసరం ఏంటని నిలదీస్తాడు. గుజరాత్‌లోని ఒక మత సంస్థ నడుపుతున్న కాలేజీ హాస్టల్‌లో వంట గదిలోకి ప్రవేశించారని ఆడపిల్లల లోదుస్తులు విప్పించి అవమానకరంగా వ్యవహరించిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ రాసిన కవిత ‘మైల’. ఆడ బతుకు శాపంగా చిత్రీకరించబడుతున్న సందర్భాలు మధ్య నెల నెలా నొప్పుల పొత్తికడుపులో ఈ నేలను మోస్తున్నావని ఎవరు గుర్తిస్తారు? ఇది వేదం పుట్టిన భూమి కదా ఇక్కడ మనిషి కంటే మైలే ముఖ్యం. అందుకే ‘నీ లోచెడ్డి విప్పి దేశం దండంపై ఆరెయ్యి’ అని తీవ్రస్థాయిలో కవి స్పందించాడు. ఈ కవి స్త్రీల మీద జరిగిన జరుగుతున్న దాడులకు, అన్యాయాలకు స్త్రీవాద రచయిత్రుల కంటే తీవ్రంగా స్పందించిన తీరు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
ప్రపంచం మొత్తం వ్యాపారమయం అయిపోయాక మనం అమ్ముకుంటూనో, కొనుక్కుంటునో జీవిస్తున్న క్షణాల్లో షాపింగ్ మాల్స్ లోను, బట్టల దుకాణాల్లోనూ గంటలు గంటలు నిలబడి వినియోగదారులకు వస్తువులో, బట్టలో చూపిస్తూ నిలబడే చాలా తక్కువ జీతాలకు జీవితాలు నెట్టుకొస్తున్న మహిళల పక్షాన నిలబడి రాసిన కవిత ‘వాళ్ళను కూర్చొనివ్వండి’ మనకు రోజు కనిపించే ఈ దృశ్యాన్ని బంగార్రాజు గుర్తించాడు. కలత చెందాడు. అవసరానికి ఆనందానికి మధ్య /వేలాడుతూ అక్షరాలా/ జీవితం/ అక్కడ నిలువు కాళ్ళ మీద/ నిలబడే వుంటుంది /దయచేసి వాళ్ళను కూర్చొనివ్వండి /వాళ్లకూ కూర్చునే హక్కుంది ( మాతృక-మార్చ్2023 ( ఈ కవితలో కవి పాటించిన లైన్ చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఈ కవితను షాపింగ్ మాల్స్ ముందు ఫ్లెక్సీ వేసి తగిలించాలన్న కోరిక కూడా ఉంది. బంగార్రాజు అందించిన మరో గొప్ప కవిత అమ్మసంచి. మనల్ని కన్నతల్లుల పొట్ట మీద కనిపించే చారికల వెనక ఉన్న అమ్మ కష్టాన్ని గురించి గుర్తు చేస్తూ మనం పుట్టక ముందు అమ్మ ఒక నాజుకుతనమని, చలాకీకి చిరునామా అని ఒక ఆశల తేనెపట్టుగా ఉంటుందని, ఉరికే వాగు నీరని అది అందరూ తెలుసుకోవాలని గ్రహించమంటాడు. పొత్తికడుపు మొత్తం కత్తితో చీరినట్టు, నువ్వు నేనూ చీరే ఉంటాము ఆ విషయాన్ని మనం అంతా మర్చిపోకూడదని తెలియజేస్తాడు. మనకోసం ఇన్ని త్యాగాలు చేసిన బంధం ఈ నేల మీద ఇన్ని యుగాలుగా నీకు కనపడిన జ్ఞాపకం ఉందా చెప్పమని ప్రశ్నిస్తాడు.
‘మనం పుట్టింది/ బ్రమ్మలకు కాదు మనిషీ/ అమ్మలకే’ (ఫేస్ బుక్- సెప్టెంబర్ 23, 2022) ఈ చివరి మూడు పాదాలు ఈ కవి ఆలోచన విధానం ఏంటో తెలుపుతాయి. బంగార్రాజు కవిత్వంలో మనకు ఇమేజినేషన్ కొత్తగా కనిపిస్తుంది. భావాల ప్రకటనలో నిజాయితీ ఉంటుంది. ఒక దృశ్యాన్ని గాని, సంఘటనను గాని తాను చాలా ప్రభావంతంగా పాఠకుల హృదయాల్లోకి కవిత్వంగా తీసుకెళ్లగలిగే శక్తిని సంపాదించాడు. ఒక కవితకు ఏ భాష అవసరమో ఆ భాషను బంగార్రాజు అందిస్తున్నాడు. చాలా కవితల్లో మాండలికాన్ని సమర్థవంతంగా వాడుకున్నాడు. ఆ కవితకు మాండలికం అవసరం అయితే ఆ కవితను మాండలికంలోనే చెప్పాడు. కృత్రిమ భావాల దట్టింపు కనిపించదు. గాలికి భయంతో చెమటలు పట్టడం, బంధాల ప్లేట్లెట్స్ పడిపోవడం, మనుషిలోని మంచి పల్స్‌డౌన్ కావడం ఇదిగో ఇలాంటి వాక్యాలు మనల్ని అతని కవిత్వంతో ప్రయాణం చేసేలా చేస్తాయి. బంగార్రాజు కవిత్వాన్ని చదువుతున్నంతసేపు అతను ఏ పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడో సులభంగా తెలిసిపోతుంది. అణగారిన వర్గాల పట్ల తీవ్రమైన ప్రేమ అతని కవిత్వంలో ఉంది. బంగార్రాజు స్త్రీల పక్షాన మాట్లాడాడు బంగార్రాజు దళితుల పక్షాన మాట్లాడుతున్నాడు. బంగార్రాజు సమకాలీన విద్రోహాలను ప్రశ్నిస్తున్నాడు.
జీవ పరిణామ సిద్ధాంతాన్ని సిలబస్ నుంచి తొలగించాలన్న వాళ్లకు ‘చరిత్రతో మాకేంపని’/ అనే కవిత ద్వారా సమాధానం ఇచ్చాడు/ .‘మనుషులంతా దేవుడికే పుట్టారని/ దేశాన్ని ఒప్పించే దానికి/ యమయాతన పడతావుంటే/ ఈడెవుడే డార్వినంటా/ జీవపరిణామ సిద్ధాంతాన్ని చెబుతా వుండాడు/ అట్టాంటోనితో మాకేం పనీ/ అందుకే పుస్తకాల్లోంచి పీకిపారేస్తావుండాం’ ( ప్రజాశక్తి, సోమవారం, సంచిక)/ బంగారు రాజు కవిత్వంలో శీర్షికలు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనబడుతుంది. శీర్షిక దగ్గర నుంచే ఆయన కలం దగ్గర పెట్టుకొని రాస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొన్నింటికి ఆంగ్లంలో శీర్షికలు ఇచ్చినా, వాటికి నిజానికి ఆంగ్లంలో శీర్షిక పెడితేనే బాగుంటుంది. ట్యాగ్ లైన్, ద బుక్ వితౌట్ ఫేస్, ఫెయిల్యూర్ స్టోరీ ఈ శీర్షికల ద్వారా ప్రకటించిన మూడు కవితలు గొప్పవిగా నిలుస్తాయి. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో దూరి హాయ్ అని పలకరించే వాళ్ళని, పాడి మీద శవాన్ని పెట్టి లైక్ కొట్టమనే వాళ్ళని, సామాజిక మాద్యమాల వల్ల జరిగే మోసాలను, మనిషి పతనాన్ని ద బుక్ వితౌట్ ఫేస్ అనే కవితలో చెప్పుకొస్తాడు. ఆపదగాలులు మనల్ని ఏ మూల నుంచి అయినా పడగొట్టే క్షణాల్ని గుర్తించమంటాడు. ట్యాగ్ లైన్ అనే కవిత ద్వారా బంధాలకు ఇవ్వాల్సిన విలువ గురించి చర్చిస్తాడు.
“బతుకంతా/ వయసు పొంగుదే ఎలా అవుతుంది/తప్పదుకాక తప్పని/ ఒక వార్ధక్యపు ఒంపు దగ్గర/ వాత్సల్యపు తులసి నీళ్లు/ ఒక్క చుక్కైనా గుటకేయాల్సిందే కదా/ నిన్ను కనిపెంచింది కానీ/ నువ్వు కనిపెంచింది కానీ/అదీకాకపోతే నిన్ను కనిపెట్టుకుని వున్నది కానీ/ ఏదైనా ఒక్క బంధం/ నీకోసం నువ్వు అట్టి పెట్టుకోవాల్సిందే ‘(ట్యాగ్ లైన్, వివిధ, మార్చ్ 20, 2023 ఆంధ్రజ్యోతి)/ కరోనా కాలంలో ఈ కవి అనేక కవితలు వెలువరించాడు. వాటిల్లో దేశం నడిచిపోతుంది, ఊరిదారిలో, మనిషి వెళ్ళిపోతున్నాడు, కొత్త ఫోటో, సహజీవనం లాంటి కవితలు గుర్తించదగినవి. తలలు కాదు మొలలు, నిషిద్ధ భూమి ఈ రెండు దళిత చైతన్యాన్ని బాగా ఆవిష్కరించాయి. ఒక నర్మగర్భ స్వప్నం ఈ కవి నుంచి వెలువడిన విభిన్నమైన కవిత. ఈ కవికి కవిత్వ నిర్మాణానికి సంబంధించి అవగాహనతో పాటు, భావజాలం, స్పష్టమైన దృక్పథం, సామాజికత అలాగే కవితను చదివించే గుణం ఉన్నాయి. రాజ్యాన్ని ప్రశ్నించే గుణం ఉంది. అమానవీయ సంఘటనను ప్రశ్నించే గుణం ఉంది. సామాజిక జవాబుదారీతనంతో ఈ కవి నడక సాగుతూనే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.