Sunday, September 22, 2024

గిల్, పంత్ శతకాల మోత.. విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్

- Advertisement -
- Advertisement -

భారత్ 287/4 డిక్లేర్డ్, బంగ్లా లక్షం 515
ప్రస్తుతం 158/4, గెలుపు బాటలో టీమిండియా
చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా గెలుపు బాటలో ప్రయాణిస్తోంది. 515 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే బంగ్లా మరో 357 పరుగులు చేయాలి. అంతకుముందు 81/3 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లు అండగా నిలిచారు. ఇద్దరు ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించారు. ఇటు గిల్ అటు పంత్ తమ మార్క్ షాట్లతో చెలరేగి పోయారు. ఈ జోడీని విడగొట్టేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

రిషబ్ జోరు..
సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్ బరిలోకి దిగిన పంత్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో స్కోరును పరుగులెత్తించాడు. గిల్ కాస్త సమన్వయంతో ఆడగా పంత్ మాత్రం ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. పంత్ ఇన్నింగ్స్ వన్డేలను తలపించింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో కనువిందు చేశాడు. పంత్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. గిల్, పంత్‌లు కుదరుకుని ఆడడంతో భారత్ మెరుగైన స్థితికి చేరుకుంది. చెలరేగి ఆడిన పంత్ తన ఖాతాలో ఆరో టెస్టు శతకాన్ని జతచేసుకున్నాడు. దూకుడును ప్రదర్శించిన పంత్ 128 బంతుల్లో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా టెస్టుల్లో ఆరు సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. ధోనీ 144 ఇన్నింగ్స్‌లలో ఆరు శతకాలు సాధించగా, పంత్ 54 ఇన్నింగ్స్‌లలోనే దీన్ని అందుకోవడం విశేషం. కాగా, గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 167 పరుగులు జోడించాడు.

గిల్ శతకం..
మరోవైపు శుభ్‌మన్ గిల్ కూడా శతకంతో అలరించాడు. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గిల్ సెంచరీ చిరస్మరణీయ శతకాన్ని నమోదు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్‌కు టెస్టుల్లో ఆది ఐదో సెంచరీ కావడం గమనార్హం. మరోవైపు కెఎల్ రాహుల్ 19 బంతుల్లోనే 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. కాగా, భారత్ స్కోరు 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా బంగ్లా ముందు క్లిష్టమైన 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

శాంటో పోరాటం..
అనంతరం భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు జాకిర్ హుస్సేన్, షద్మాన్ ఇస్లామ్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. జాకిర్ ధాటిగా ఆడగా, ఇస్లామ్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. దూకుడును ప్రదర్శించిన జాకిర్ 47 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 33 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.

మరోవైపు ఇస్లామ్ 3 ఫోర్లతో 35 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శాంటో 60 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 51 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కాగా, మోమినుల్ హక్ (13), ముష్ఫికుర్ రహీం (13) విఫలమయ్యారు. షకిబ్ అల్ హసన్ (5) నాటౌట్‌గా నిలిచాడు. కాగా, భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లను పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News