చట్టోగ్రామ్: అఫ్గానిస్థాన్‌తో బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. అఫ్గాన్ బౌలర్ ఫజల్ ఫరూఖి అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. అతని దెబ్బకు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (8), లిటన్ దాస్(1), వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం(3), యాసిర్ అలీ(0) పెవిలియన్ చేరారు. మరోవైపు షకిబ్ అల్ హసన్(10)ను ముజీబ్, మహ్మదుల్లా(8)ను రషీద్ ఖాన్ వెనక్కి పంపారు. దీంతో బంగ్లాదేశ్ 45 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఈ దశలో అఫిఫ్ హుస్సేన్ 93(నాటౌట్), మెహదీ హసన్ 81(నాటౌట్) చిరస్మరణీయ బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్‌కు సంచలన విజయం సాధించి పెట్టారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టులో నజీబుల్లా (67) మాత్రమే రాణించాడు.
Bangladesh Beat Afghan by 4 wickets in 1st ODI