Saturday, November 16, 2024

కివీస్‌కు బంగ్లాదేశ్ షాక్

- Advertisement -
- Advertisement -

సిల్హేట్: బంగ్లాదేశ్ టెస్టుల్లో అరుదైన విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని దక్కించుకుంది. 332 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ శనివారం చివరి రోజు 181 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ అద్భుత బౌలింగ్‌తో బంగ్లాను గెలిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో తైజుల్ 75 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా అతనికి నాలుగు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో తైజుల్ ఏకంగా పది వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నయీం హసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. చివరి రోజు డారిల్ మిగిలిన మూడు వికెట్లను బంగ్లా బౌలర్లు పడగొట్టారు. దీంతో కివీస్‌కు 150 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

కివీస్ టీమ్‌లో డారిల్ మిఛెల్ ఏడు ఫోర్లతో 58 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ టిమ్ సౌథి ధాటిగా ఆడి 34 పరుగులు సాధించాడు. ఐష్ సోధి 91 బంతుల్లో 22 పరుగులు చేశాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 310 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 338 పరుగులు చేసి కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ షాంటో (105) శతకంతో జట్టును ఆదుకున్నాడు. ముష్ఫికుర్ రహీం, మెహదీ హసన్ మీరాజ్‌లు అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక బౌలింగ్‌లో తైజుల్ మ్యాచ్‌లో పది వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. సొంత గడ్డపై టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే మొదటి విజయం కావడం విశేషం. ఇదిలావుంటే ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటిగా పేరున్న న్యూజిలాండ్‌ను ఓడించడంతో బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News