Thursday, September 19, 2024

ఫైనల్లో బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -
Bangladesh
సెమీస్‌లో కివీస్‌పై ఘన విజయం,  భారత్‌తో తుది పోరుకు సిద్ధం

పొచెస్ట్రూమ్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్19 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్ సమరంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకుంటుంది. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక, సెమీస్ సమరంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తనకంటే ఎంతో బలమైన న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి తుది సమరానికి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు మాత్రమే చేసింది.

ప్రత్యర్థి బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. మహ్మదుల్ హసన్ జాయ్ అద్భుత సెంచరీతో బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన మహ్మదుల్ హసన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఓడిన న్యూజిలాండ్ మూడో స్థానం కోసం జరిగే పోరులో పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ శనివారం జరుగుతుంది.

ఆదుకున్న హస్

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ తంజీద్ హసన్ (3) ఆరంభంలోనే వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ పర్వేజ్ (14) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను మహ్మదుల్ హసన్ తనపై వేసుకున్నాడు. అతనికి తౌహిద్ అండగా నిలిచాడు. ఇటు హసన్, అటు తౌహిద్ సమన్వయంతో ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తౌహిద్ 4 ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ క్రమంలో హసన్‌తో కలిసి మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన షాదాత్ హుస్సేన్ అండతో హసన్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. మరోవైపు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్ హసన్ 127 బంతుల్లో 13 ఫోర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. షాదాత్ హుస్సేన్ అజేయంగా 40 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో తనవంతు పాత్ర పోషించాడు.

బెక్‌హామ్ మెరుపులు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను బంగ్లాదేశ్ బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ కివీస్‌ను కోలుకోనివ్వలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బెక్‌హామ్ ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బెక్‌హామ్ రెండు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 75 పరుగులు చేశాడు. మరోవైపు నికోలస్ (44) తనవంతు పాత్ర పోషించాడు. బంగ్లా బౌలర్లలో షరీఫుల్ ఇస్లామ్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Bangladesh Beat New Zealand By 6 Wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News