Thursday, January 23, 2025

ఆర్థిక ఊబిలో బంగ్లాదేశ్!

- Advertisement -
- Advertisement -

Indian Independence Day Diamond Celebrations పిట్ట కొంచెం కూత ఘనం అనిపించుకొన్న బంగ్లాదేశ్ కూడా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయిందంటే నమ్మబుద్ధి కాదు. కాని ఇది పచ్చి నిజం, చేదు నిజం. కొవిడ్ -19, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, డాలర్ దాష్టీకం పలు దేశాలను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. శ్రీలంక అంతటి దివాలా స్థితికి కాకపోయినా వాటిని ఆ వైపు మళ్ళిస్తున్నాయి. రెడీమేడ్ దుస్తుల ఎగుమతిలో ఎదురులేని స్థితిని సంపాదించుకొని బంగ్లాదేశ్ ఇటీవలి వరకు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పు డు చేతిలో భిక్షపాత్రతో అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల ముందు నిలబడింది. వచ్చే మూడేళ్లలో 4.5 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలని బంగ్లాదేశ్ పెట్టుకొన్న దరఖాస్తును అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆమోదించింది. బిలియన్ డాలర్ల కోసం ప్రపంచ బ్యాంకును అర్ధించడం, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి వివిధ బహుళజాతి పరపతి సంస్థల నుంచి దాదాపు 3 బిలియన్ డాలర్ల అప్పుకోరడం బంగ్లాదేశ్ ఆర్ధిక దుస్థితిని చాటుతున్నాయి. కొవిడ్‌కు ముందు బంగ్లాదేశ్ వృద్ధిరేటు అద్భుతంగా ఉండేది.

స్థూల దేశీయాత్పత్తి (జిడిపి)లో 7-.8 శాతంగా కళ్ళు మిరుమిట్లు గొలిపేది. 416 బిలియన్ల అమెరికన్ డాలర్ల జిడిపితో ఖజానా ధగధగలాడేది. ఇప్పుడు దయనీయమైన పరిస్థితిలో పడిపోయింది. విదేశీ మారక నిల్వలు 45 బిలియన్ డాలర్ల నుంచి 39 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కేవలం అయిదు మాసాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ద్రవ్యోల్బణం 7 శాతం దాటిపోయి పడగ విప్పి బుసకొడుతున్నది. పెరిగిపోయిన క్రూడాయిల్ ధరలు ఖజానాకు భారమయ్యాయి. దానిని పరిమితం చేసుకోడానికి పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు చేశారు. ఇది ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. ప్రతిపక్షాలకు అయాచితంగా అందివచ్చిన ఆయుధమైంది. ప్రభుత్వం సొంత ఇంధన వనరుల అన్వేషణను నిర్లక్షం చేసి దిగుమతులపై విశేషంగా ఆధారపడడాన్ని అవి తప్పుపడుతున్నాయి.

అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి మందగమనం వల్ల రెడీమేడ్ దుస్తులకు గిరాకీ పడిపోయింది. ఇది కొవిడ్ వల్ల శ్రీలంకలో పర్యాటక ఆదాయం దెబ్బతిన్న మాదిరి పరిణామం. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80 శాతం రెడీమేడ్ దుస్తులే ఉంటాయి. ఆ కంపెనీలకు విదేశాల నుంచి ఆర్డర్లు పడిపోయాయి. విదేశాల్లోని బంగ్లాదేశీయుల నుంచి డాలర్ల రాకడ కూడా తగ్గిపోయింది. వ్యవసాయం కోసం విదేశాల నుంచి తెచ్చుకొనే ఎరువుల మీద బంగ్లాదేశ్ ఆధారపడి వుంది. ఈ విషయంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం బంగ్లాదేశ్‌ను విశేషంగా దెబ్బ తీసింది. ఎరువులు రష్యా, ఉక్రెయిన్ల నుంచే తెచ్చుకోవాలి. యుద్ధం వల్ల అవి ప్రియమైపోయాయి. డాలర్‌తో బంగ్లా కరెన్సీ టాకా విలువ 112 టాకాలకు పడిపోయింది. వ్యాపారులు ఎగుమతి, దిగుమతుల ఇన్‌వాయిస్‌లలో సరకు విలువను తప్పు గా చూపడం ద్వారా భారీ స్థాయిలో మోసానికి పాల్పడుతున్నారు. అది దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నది. ఇన్ని అనర్థాల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేసింది. అధికారుల విదేశీ ప్రయాణాలు తగ్గించేసింది. విద్యుత్‌కు రేషన్ ప్రవేశపెట్టింది.

ఈ చర్యలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. అత్యవసరం కాని భారీ ప్రాజెక్టులను చేపట్టడం వల్ల అప్పు పెరిగిపోయింది. పద్మా బ్రిడ్జి, రూప్పూర్ అణు విద్యుత్తు ప్లాంటు, ఢాకా సిటీ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల ఖర్చు అనేక రెట్లు పెరిగిపోయింది. వెనుకబడిన వాయువ్య ప్రాంతాన్ని, ఉత్తర, తూర్పు ప్రాంతాలతో కలుపుతూ పద్మా నదిపై నిర్మించిన రైలు, రోడ్డు బ్రిడ్జి ఖర్చు 1.16 బిలియన్ల డాలర్ల నుంచి 3.6 బిలియన్ల్ల డాలర్లకు ఎగబాకింది. అణు విద్యుత్ కేంద్రం ఖర్చు 12.65 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. పూర్తి అయ్యేసరికి ఎక్కడికి చేరుకొంటుందో చెప్పలేము. ఈ ప్రాజెక్టల కోసమే విశేషంగా విదేశాల నుంచి అప్పు చేశారు. చైనా, జపాన్, రష్యాలకు ఇవ్వాల్సిన అప్పుపేరుకు పోయింది.

బ్యాంకుల నిరర్ధక ఆస్తులు, ఎగవేతలు మితిమించిపోయాయి. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు వాటిని విశేషంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. మన దేశానికి చుట్టూ గల శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు సంక్షోభంలో కూరుకుపోడం గమనార్హం. ఇటీవలి మాసాల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించినవి ఈ మూడు దేశాలే. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నందున ప్రభుత్వంపై ప్రతిపక్షం దాడి రోజు రోజుకీ సునిశితమవుతున్నది. అభివృద్ధి పేరిట మోయలేనంత భారాన్నిపైన వేసుకోడమే బంగ్లాదేశ్ కష్టాలకు ప్రధాన కారణ మనిపిస్తున్నది. డాలర్‌తో ముడిపడిన అంతర్జాతీయ లావాదేవీల వ్యవస్థ, అత్యవసరమైన ఆయిల్, ఆహార అవసరాలకు దిగుమతులపై ఆధారపడడం బంగ్లాదేశ్‌ను స్వయం సమృద్ధి నుంచి పరాధీనతలో కూరుకుపోయేలా చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News