Wednesday, January 22, 2025

రేపు బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

ఢాకా : పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఆదివారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కూడా ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ విజయం సాధించే పరిస్థితి ఉంది. ఇది ఆమెకు వరుసగా నాలుగవ విజయం అవుతుంది. ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బిఎన్‌పి పోటీలో లేదు. దేశంలో హింసాకాండ నేపథ్యంలో బిఎన్‌పి శనివారం నుంచి దేశంలో 48 గంటల జాతీయ హర్తాళ్‌ను ఆరంభించింది. అక్రమ సర్కారుకు వ్యతిరేకంగా తమ ఉద్యమం సాగిస్తుందని ప్రతిపక్షం ప్రకటించింది. పార్లమెంట్‌లోని 300 నియోజకవర్గాలలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దేశంలో మొత్తం 119.6 మిలియన్ నమోదిత ఓటర్లు ఉన్నారు. మొత్తం 42000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఈ ఎన్నికలల్లో 27 రాజకీయ పార్టీల నుంచి 1500కి పైగా అభ్యర్థులు రంగంలో నిలిచారు.

ఎన్నికల సక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు, 100 మందికి పైగా విదేశీ పరిశీలకులను రప్పించినట్లు , వీరిలో ముగ్గురు భారతీయ అధికారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. దేశానికి జరిగే 12వ సార్వత్రిక ఎన్నికల కోసం భారీ స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికలు న్యాయపరంగా జరిగేందుకు జాతీయ , అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు జరిగాయని , ఐరాస సంబంధిత అంతర్జాతీయ కట్టుబాట్ల ఒప్పందాలకు లోబడి , మానవ హక్కుల పరిరక్షణ, పౌరుల భద్రత, రాజకీయ హక్కుల పరిరక్షణకు లోబడే ఎన్నికల నిర్వహణ ఉంటుందని బంగ్లాదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ఖాజీ హబీబుల్ అవాల్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ఆరంభమవుతుంది. సాయింత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఫలితాలు సోమవారం వెలువడుతాయి. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బిఎన్‌పి) అధినేత , మాజీ ప్రధాని ఖలీదా జియా (78) అవినీతి కేసుల్లో ఇప్పుడు జైలుపాలయి ఉన్నారు.

దీనితో ఈ పార్టీ ఇప్పుడు ఎన్నికలలో బరిలోకి దిగలేదు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హసీనా టీవీ ద్వారా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. దేశ రాజ్యాంగ ప్రక్రియను విచ్ఛిన్నం చేసే ఆలోచనలకు ఆజ్యం పోయరాదని ప్రజాస్వామిక , చట్టానికి కట్టుబడే పార్టీలన్ని కూడా పాటించాలని విజ్ఞప్తి చేశారు. బిఎన్‌పి హర్తాళ్ సోమవారం సాయంత్రం ముగుస్తుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం రంగంలోకి లేకపోవడంతో అధికార పార్టీదే విజయంగా భావిస్తున్నారు. ఇప్పుడు బరిలో ఉన్న వాటిలో జతియా పార్టీ (జాపా) ఇతర పార్టీలు రంగంలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News