Monday, January 27, 2025

కష్టాల్లో బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ కష్టాల్లో చిక్కుకుంది. 202 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ మంగళవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 101 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటాలంటే బంగ్లా మరో 101 పరుగులు చేయాలి. రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ షద్మన్ ఇస్లామ్ (1), వన్‌డౌన్‌లో వచ్చిన మోమినుల్ హక్ (0) విఫలమయ్యారు. ఈ రెండు వికెట్లను రబడా పడగొట్టాడు. దీంతో బంగ్లా 4 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటోతో కలిసి మరో ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కానీ కుదురుగా ఆడుతున్న కెప్టెన్ నజ్ముల్‌ను కేశవ్ మహారాజ్ వెనక్కి పంపాడు.

నజ్ముల్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు ఆట నిలిపి వేసే సమయానికి హసన్ జాయ్ 80 బంతుల్లో ఐదు ఫోర్లతో 38 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం అండగా నిలిచాడు. ధాటిగా ఆడిన రహీం 26 బంతుల్లోనే 3 ఫోర్లతో అజేయంగా 31 పరుగులు చేశాడు. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ కైల్ వెర్రిన్నె అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కైల్ 144 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. అతనికి వియాన్ ముల్డర్ (54), డేన్ పిడెట్ (32) అండగా నిలిచారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ ఐదు, హసన్ మహమూద్ మూడు, మెహదీ హసన్ రెండు వికెట్లను పడగొట్టారు. కాగా, బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News