ఢాకా : బంగ్లాదేశ్‌లో ఇటీవలి దౌర్జన్య సంఘటనల సమయంలో భద్రత బలగాల నుంచి లూటీ చేసిన రైఫిళ్లు సహా అక్రమ, అనధికార తుపాకులను ఈ నెల 19 నాటికి అప్పగించాలని నిరసనకారులను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ దేశీయ వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ సోమవారం కోరినట్లు ఒక మీడియా వార్త ద్వారా తెలుస్తోంది.
ఆ ఆయుధాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు అప్పగించకపోతే అధికారులు సోదాలు చేపడతారని, ఎవరి దగ్గరైనా అనధికార ఆయుధాలు ఉన్నట్లు తేలితే వారిపై అభియోగాలు దాఖలు జరుగుతుందని హుస్సేన్ చెప్పినట్లు ‘ది డైలీ స్టార్’ పత్రిక తెలిపింది. ప్రధాని షేఖ్ హసీనా ఉద్వాసనకు దారి తీసిన భారీ నిరసనల సమయంలో గాయపడిన పారామిలిటరీ బంగ్లాదేశ్ అన్సార్ సభ్యులను సమష్టి సైనిక ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం హుస్సేన్ విలేకరులతో మాట్లాడారు.
నిరసనల సమయంలో విద్యార్థులతో సహా సుమారు 500 మంది వ్యక్తులు మరణించారని, అనేక వేల మంది గాయపడ్డారని హుస్సేన్ తెలియజేశారు. ‘ఒక 7.62 ఎంఎం రైఫిల్‌ను ఒక యువకుడు తీసుకువెళుతుండడం వీడియోలో కనిపించింది. అంటే ఆ రైఫిల్‌ను వాపసు చేయలేదన్న మాట. అతను (భయంతో) అప్పగించకపోతే, మరెవరికైనా ఆయుధాలు అందజేయవలసింది’ అని ఆయన సూచించారు. అన్సార్ సభ్యులపై కాల్పులు జరిపిన పౌర దుస్తుల్లోని యువకుని గుర్తింపునకు తాము దర్యాప్తు చేయగలమని హుస్సేన్ చెప్పారు.