Monday, December 23, 2024

బీమార్ బంగ్లా!

- Advertisement -
- Advertisement -

సోనార్ బంగ్లా బీమార్ బంగ్లాగా ఎలా మారిపోయింది? సిరి బంగ్లాదేశ్ శ్రీలంక అడుగులు ఎందుకు వేస్తున్నది? శీఘ్ర అభివృద్ధి సూచీలతో చిన్న దేశాల్లో మిన్న అనిపించుకొన్న దేశం భారీ రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ముందు ఎందుకు మోకరిల్లవలసి వచ్చింది? అక్కడ వచ్చే సంవత్సరం డిసెంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ధరలు మిన్నంటిపోయి తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రజలు నిరసనాగ్నులుగా రగులుతున్నారు. పోలీసులను ప్రతిఘటిస్తున్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయి అత్యవసరమైన దిగుమతులకు సైతం డాలర్లు కరువయ్యే స్థితికి చేరువలో వుంది. ఆయిల్ ధరలు పెరగడం, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మూలిగే నక్క మీద తాటి పండును తలపిస్తున్నది. మూడేళ్ళ క్రితం 2019లో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం అత్యధికంగా 1856 డాలర్లు.

పాకిస్తాన్ తలసరి రాబడి (1285 డాలర్లు) కంటే ఎక్కువ. భారత దేశ తలసరి రాబడి కంటే 250 డాలర్లు మాత్రమే తక్కువ. 2020లో ఇండియా వృద్ధి రేటు 7.3 శాతం పడిపోయినప్పుడు బంగ్లాదేశ్ వృద్ధి 2.4 శాతం పెరిగింది. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఆర్ధిక సూచీలన్నీ కరోనా విష కౌగిలిలో విలవిలలాడుతున్న సమయంలో బంగ్లాదేశ్ చిన్న దేశాల్లో చిరుత పులిలా దూసుకుపోడం ఆశ్చర్యం కలిగించింది. 2019లో బంగ్లాదేశ్ ప్రజల జీవన ప్రమాణం 72.6 సంవత్సరాలు. 2000 కంటే 7 యేళ్ళు యెక్కువ. మానవాభివృద్ధి సూచీలో ఇప్పటికీ నేపాల్, పాకిస్తాన్ కంటే పైనే వుంది. అప్పట్లో రెడీమేడ్ దుస్తుల ఎగుమతి బంగ్లాదేశ్‌కు విశేషంగా విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టేది. మొత్తం ఎగుమతుల్లో 84 శాతం ఈ దుస్తులే కావడం విశేషం.

అయితే అంతటి ఉచ్ఛ స్థితిలోని దేశం ఇప్పుడిలా అంతర్జాతీయ రుణ వితరణ సంస్థల వద్ద భిక్షా పాత్ర పట్టుకొని నిలబడవలసిన దుస్థితికి ఎలా దిగజారింది? 2009లో అధికారానికి వచ్చినప్పటి నుంచి షేక్ హసీనా ప్రభుత్వం పద్మ బ్రిడ్జి, రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రం, ఢాకా సిటీ మెట్రో రైలు, కర్ణాఫూల్ సొరంగ మార్గం వంటి భారీ ప్రాజెక్టులను చేపట్టడం వల్ల ఖజానా ఖాళీ కావడం మొదలైంది. 2007లో పద్మ బ్రిడ్జి వ్యయం 1.16 బిలియన్ డాలర్లు కాగలదని భావించగా, అది 3.6 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. అణు విద్యుత్ కర్మాగారం ఖర్చు సైతం 12.65 బిలియన్ డాలర్లకు చేరుకొన్నది. మెట్రో రైలు వ్యయ అంచనా, ముందు అనుకొన్న 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.3 బిలియన్ డాలర్లకు పెరిగి తడిసి మోపెడయింది. బంగ్లాదేశ్‌లో రోడ్డు నిర్మాణం అత్యంత వ్యయ భరితంగా తయారయిందని, సామాగ్రి ధరలను విపరీతంగా పెంచేశారని, అవినీతి విలయ తాండవం కనిపిస్తున్నదని వరల్డ్ బ్యాంకు అభిప్రాయపడింది.

దీనికి తోడు భారీ కుంభకోణాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బ తిన్నది. విదేశాల్లోని బంగ్లాదేశీయుల నుంచి విదేశీ మారక ద్రవ్య రాబడి పడిపోయింది. కొవిడ్ కారణంగా యూరపు, అమెరికాల నుంచి ఆర్డర్లు తగ్గిపోయి ఎగుమతులు క్షీణించాయి. ఇలా అనేక కారణాల వల్ల ఆర్ధికంగా పతనమైన బంగ్లాదేశ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 450 బిలియన్ డాలర్ల రుణానికి అర్జీ పెట్టుకొన్నది. వచ్చే మూడేళ్ళ పాటు ఈ రుణాన్ని అందించడానికి అది అంగీకరించింది. అయితే దానికి అలవాటైన పద్ధతిలోనే సంక్షేమ వ్యయాన్ని మానుకోవాలని, సబ్సిడీలలో పెద్ద ఎత్తున కోత విధించాలని షరతులు పెట్టింది. ఢాకా భిక్షాటన ఐఎంఎఫ్‌తో ఆగిపోలేదు. వరల్డ్ బ్యాంకును బిలియన్ డాలర్లు అడిగింది. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ వంటి సంస్థల నుంచి దాదాపు 3 బిలియన్ డాలర్ల రుణాన్ని అర్ధించింది. 2020 నాటికే ఇటువంటి సంస్థల నుంచి 1.7 బిలియన్ డాలర్లు తీసుకొన్నది. వీటి నుంచి బడ్జెట్ సపోర్టు రుణంగా గత రెండు ఆర్ధిక సంవత్సరాల్లో 5.8 బిలియన్ డాలర్లు తీసుకొన్నది.

ఇంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయినా బంగ్లాదేశ్‌కు అప్పు ఇంకా పలుకుతుండడం విశేషం. అయితే ఇది హసీనా ప్రభుత్వం చేతులను కట్టివేస్తుంది. ప్రజాహిత నిర్ణయాలు తీసుకోకుండా చేస్తుంది. అది దాని పట్ల ప్రజల్లో అసంతృప్తిని రాజేస్తుంది. ఎన్నికల సంవత్సరంలో హసీనాకు పెను సవాలుగా మారుతుంది. బంగ్లాదేశ్ విదేశీ మారక విత్తం కోసం కేవలం రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల పైనే ఆధారపడి ఇతర మార్గాలను అనుసరించకపోడం అది ఆకస్మికంగా ఇబ్బందుల పాలు కావడానికి దారి తీసిన ప్రధానంశం.

ఔషధాల ఎగుమతిపై దృష్టి పెట్టినప్పటికీ ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నది. దక్షిణ కొరియా మాదిరిగా అనతికాలంలోనే ఉక్కు, యంత్రాలు, రసాయనాలు వంటి అనేక రకాల సామగ్రి ఎగుమతులను సాధించాలని నిపుణులు భావిస్తున్నారు. ఎగుమతులు తగ్గినప్పుడు దిగుమతులను కూడా పరిమితం చేసుకోగలగాలి. 2021లో 20 శాతం పెరిగిన బంగ్లాదేశ్ దిగుమతులు వర్తమాన సంవత్సరంలో 30 శాతం ఎగబాకాయి. ఇటువంటి లోపాలను సరిదిద్దుకోడం, అవినీతిని అరికట్టడం వంటి లక్ష్యాలను చేరుకోడంలో ఈ చిన్నదేశం ఎంత వరకు విజయవంతమవుతుందో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News