బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. దీంతో బంగ్లా జట్టు ఇప్పటికే 9 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు పయనిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 26/2తో చివరి రోజు ఆట ప్రారంభించిన బంగ్లాకు అశ్విన్ షాకిచ్చాడు. జట్టు స్కోరుకు పరుగులు జోడించిన అనంతరం మొమినుల్ హక్(2)ను ఔట్ చేసిన అశ్విన్.. భారత్ కు ఆదిలోనే బ్రేక్ ఇచ్చాడు.
ఆ తర్వాత జడేజా కూడా చెలరేగడంతో బంగ్లా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో ప్రస్తుతం ఆ జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో బ్యాట్స్ మెన్ రహీమ్(27), ఖాలిద్ అహ్మద్(0)లు ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా రెండు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 78 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.