Thursday, September 19, 2024

నోబెల్ గ్రహీత యూనస్ కు బంగ్లా పగ్గాలు?

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ మంగళవారం పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీనితో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రధాని షేఖ్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేసి, దేశం నుంచి పారిపోయిన మరునాడు ఈ పరిణామం చోటు చేసుకున్నది. ‘అధ్యక్షుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు కింద జాతీయ సంగ్సద్ (పార్లమెంట్)ను రద్దు చేశారు’ అని బంగభవన్ (అధ్యక్ష ప్రాసాదం) అధికార ప్రతినిధి ఒకరు ‘పిటిఐ’తో చెప్పారు. ‘మూడు సాయుధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, పౌర సమాజ ప్రతినిధులు, వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం (ఎడిఎస్‌ఎం) నేతలతో అధ్యక్షుని చర్చల అనంతరం పార్లమెంట్ రద్దుకు నిర్ణయం తీసుకోవడమైంది’ అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేశారు.

పూర్తి స్థాయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అధికారులు ప్రకటించారు. కాగా, పార్లమెంట్ రద్దుకు అధ్యక్షుని ఉత్తర్వుతో తిరిగి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి)చీఫ్, మాజీ ప్రధాని ఖాలెదా జియాను గృహ నిర్బంధం నుంచి విడుదల చేసినట్లు కూడా ఆ ప్రతినిధి వెల్లడించారు. 79 ఏళ్ల మాజీ ప్రధాని ఖాలెదా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో సహా వివిధ రుగ్మతలతో దీర్ఘ కాలంగా బాధ పడుతున్నారు. జూలై 1 నుంచి అరెస్టు అయిన వారిని విడుదల చేసే ప్రక్రియ మొదలైనట్లు, చాలా మందిని ఇప్పటికే విడుదల చేసినట్లు ఆ ప్రతినిధి తెలియజేశారు. వరుసగా నాలుగవ విడత ప్రధానిగా హసీనాను నియమిస్తూ జనవరి 7 తరువాత ఏర్పాటైన 12వ పార్లమెంట్ రద్దుకు వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమ బృందం అంతకుముందు గడువు విధించింది. ఉద్యమ కీలక సమన్వయకర్తల్లో ఒకరైన నహీద్ ఇస్లామ్ మంగళవారం తెల్లవారు జామున సామాజిక మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మధ్యంతర ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ పేరును ప్రతిపాదించారు.

84 ఏళ్ల యూనస్‌తో తాము ఇప్పటికే మాట్లాడామని, బంగ్లాదేశ్‌ను కాపాడేందుకు ఆ బాధ్యత స్వీకరణకు ఆయన అంగీకరించారని నహీద్ తెలిపారు. ‘విద్యార్థులు ప్రతిపాదించిన ప్రభుత్వం కన్నా వేరే ప్రభుత్వాన్ని అంగీకరించేది లేదు. మేము చెప్పినట్లుగా ఏ సైనిక ప్రభుత్వాన్నీ లేదా సైన్యం మద్దతు ఉన్న ప్రభుత్వాన్నీ లేదా ఫాసిస్టుల ప్రభుత్వాన్నీ అంగీకరించేది లేదు’ అని నహీద్ స్పష్టం చేశారు. నహీద్‌కు రెండు వైపులా మరి ఇద్దరు సమన్వయకర్తలు ఉన్నారు. యూనస్ ప్రస్తుతం దేశంలో లేరు. కానీ, హసీనా ప్రభుత్వం ఉద్వాసనను ఆయన స్వాగతించారు. ఈ పరిణామం దేశ ‘రెండవ విమోచన’గా ఆయన పేర్కొన్నారు. గ్రామీణ్ బ్యాంక్ ద్వారా దారిద్య్ర వ్యతిరేక ఉద్యమం సాగించినందుకు ఆయన 2006లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. ముఖ్య సలహాదారుగా మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు ఆయన అంగీకరించారని ఒక ప్రతినిధిని ఉటంకిస్తూ ‘డైలీ స్టార్’ తెలియజేసింది. ‘విద్యార్థులు ఎన్నో త్యాగాలు చేసినప్పుడు, దేశ ప్రజలు ఎన్నో త్యాగాలు చేసినప్పుడు నాకూ కొంత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత స్వీకరించగలనని విద్యార్థులతో అప్పుడు చెప్పాను’ అని యూనస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News