ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది తొలి భాగంలోనైనా బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వస్తామని ఆ దేశ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనుస్ సోమవారం తెలిపారు. అయితే రాజకీయ ఏకాభిప్రాయం, దానికి ముందు చేపట్టే సంస్కరణలపైనే ఎన్నికల సమయం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘విజయ్ దివస్’ సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ సైన్యం, భారత్‌కు లొంగిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ‘విజయ్ దివస్’ జరుపుకుంటారు.
ప్రధాన సంస్కరణలు చేపట్టాక బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని యూనుస్ అనేక సందర్భాల్లో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు చేపట్టాక, జాతీయ ఏకాభిప్రాయం కుదిరాక చేపట్టే ఎన్నికలకు కనీసం మరో ఆరు నెలలైన పట్టవచ్చని ఆయన అన్నారు.బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసన అనంతరం ప్రధాని షేక్ హసీనా దేశం వదిలిపోయాక, యూన్ తాత్కాలిక ప్రభుత్వానికి అపద్ధర్మ నాయకుడుగా(కేర్ టేకర్‌గా) కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఓటర్ల జాబితా తయారు చేయడం, ఎన్నికలు నిర్వహించడం అన్నది పెద్ద ప్రక్రియ.