ఢాకా: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వం లోని భారత ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ 19 మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయాల్లో తమకు అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. ఆమె సోమవారం భారత పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో ఓ వార్తాసంస్థతో ఆమె ఆదివారం మాట్లాడారు. వ్యాక్సిన్ మైత్రి పథకంలో భాగంగా బంగ్లాదేశ్‌కు మాత్రమే కాకుండా కొన్ని దక్షిణాసియా దేశాలకు కూడా కొవిడ్ వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం పంపిందని ఈ వ్యాక్సిన్లు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్ లోనూ, దాని పొరుగు దేశమైన పోలండ్ లోనూ భారతీయ విద్యార్థుల మాదిరిగాగనే తమ దేశ విద్యార్థులు కూడా చిక్కుకు పోయారన్నారు. ఆ విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో భారత్ చేసిన సహాయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య స్నేహం కాలపరీక్షకు నిలిచిందన్నారు. అవసరమైన ప్రతిసారీ బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలిచిందన్నారు. మొదట 1971లో జరిగిన యుద్ధంలో, ఆ తర్వాత ఇతర సందర్భాల్లో తమకు భారత్ మద్దతుగా ఉంటోందన్నారు.
Bangladesh PM Praises on PM Modi