Tuesday, September 17, 2024

హసీనా ఔట్

- Advertisement -
- Advertisement -

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హింసాత్మక కోటా ఉద్యమం కీలక మలుపు తిరిగింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం తమ పదవికి రాజీనామా చేశారు. ఆదివారం తీవ్రస్థాయి హింసాత్మక ఘటనలు, దాదాపు వంద మంది వరకూ మృతి చెందడం, వీధుల్లో అరాచకం, అధికార అవామీలీగ్ కార్యకర్తలకు, హసీనా వ్యతిరేకులకు మధ్య వీధి పోరాటాలు, ఈ దశలోనే దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాఖర్ ఉజ్ జమాన్ తాను ప్రజల పక్షం అని ప్రకటించడం , తీవ్ర పరిణామాలకు దారితీసింది. ప్రధాని రాజీనామా చేశారని, దేశంలో అత్యవసర ప్రాతిపదికన మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతోందని ఆర్మీచీఫ్ అధికారికంగా ప్రకటించారు. దీనితో రాబోయే ప్రభుత్వం పూర్తిగా సైనిక గొడుగునీడలోనే ఉంటుందనే విషయం స్పష్టం అయింది. పదవికి రాజీనామా చేసిన షే76 సంవత్సరాల క్ హసీనా దేశం విడిచిపెట్టి పోయినట్లు వెల్లడైంది. తొలుత ఆమె భారతదేశంలోని ఓ నగరానికి వచ్చినట్లు అనిర్థారిత వార్తలు వెలువడ్డాయి.

కానీ ఆమె లండన్‌కు వెళ్లారని అక్కడి వర్గాల నుంచి సమాచారం అందింది. కాగా దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీచీఫ్ సోమవారం హుటాహుటిన బంగ్లా టీవీ ద్వారా జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ‘నేనే ఈ క్లిష్ట దశలో దేశం బాధ్యత తీసుకుంటున్నాను. దయచేసి సహకరించండి. పరిస్థితులు కుదురుకునేలా చేసేందుకు అంతా సహకరించాలి’ అని సైనిక ప్రధానాధిపతి పిలుపు నిచ్చారు. తాను రాజకీయ నేతలను కలిసినట్లు, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను సైన్యం తీసుకుంటుందని వారికి చెప్పినట్లు సైనిక చీఫ్ తమ ప్రసంగంలో వివరించారు. దీనితో దేశంలో సైనిక నియంత్రణ అంశం స్పష్టం అయింది. నిరసనలు దేశవ్యాప్తం అయిన దశలో పోలీసులు, సైన్యం సంయమనం పాటించాలని, సాధ్యమైనంత వరకూ నిరసనకారులపై కాల్పులకు దిగరాదని ఆదేశాలు ఇచ్చారు. నిరసనకారులు ఇక హింసాకాండకు దిగరాదని , శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు.

హసీనా అధికారిక నివాసంపై దాడులు
ఢాకా వదిలి విదేశాలకు ఫరారయిన నేత?
సోమవారం తన పదవికి రాజీనామా చేసిన ప్రధాని హసీనా వెనువెంటనే అరెస్టు, నిర్బంధం ఇతరత్ర పరిణామాలను తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆమె ఎక్కుడికి , ఏ సమయంలో వెళ్లారనేది నిర్థారణ కాలేదు. ఇప్పటివరకూ అయితే అధికార వర్గాల నుంచి హసీనా రాజీనామా, ఆమె దేశం వదిలిన విషయం గురించి ప్రకటించలేదు. కాగా ఆమె హెలికాప్టర్ ద్వారా ముందుగా సమీపంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వెళ్లారని బిబిసి న్యూస్ తెలిపింది. ఈ విషయాన్ని త్రిపురలోని అధికారులు కానీ, భారత విదేశాంగ కార్యాలయం కానీ ధృవీకరించలేదు. తమకు అయితే దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని త్రిపుర హోం శాఖ కార్యదర్శి పికె చక్రవరి వార్తా సంస్థలకు తెలిపారు.

హసీనా ఆమె చెల్లెలు షేక్ రెహానాతో కలిసి హెలికాప్టర్‌లో వెళ్లినట్లు స్థానిక జమునా టీవీ ఛానల్ వార్త వెలువరించింది. హసీనా రాజీనామా వార్తతో దేశంలోని పలు ప్రాంతాలలో జనం హర్షంతో నినాదాలకు దిగుతూ వీధుల్లోకి రావడం, విక్టరీ వి చిహ్నం చూపడం వంటి దృశ్యాలు వెల్లువెత్తాయి. ఢాకాలోని హసీనా అధికారిక నివాసం ‘ఘనభబన్‌లోకి జనం చొచ్చుకుపొయ్యారు. వారికి ఎక్కడా భద్రతా బలగాల నుంచి అడ్డంకి లేకుండా పోయింది. లోపలికి వెళ్లిన జనం హసీనా ఉంటూ వచ్చిన ఇంటోల డ్రాయింగ్ రూంల్లోకి చేరడం , లోపల ఉన్న ఫర్నీచర్, టీవీలు వంటివి తీసుకుని వెళ్లడం కన్పించింది. దేశం విడిచి పారిపోయిందంటూ పెద్ద పెట్టున జనం నినాదాలకు దిగారు.

ముజిబుర్ రెహ్మన్ విగ్రహం ధ్వంసం
ఇందిరా గాంధీ సెంటర్ పై దాడి
ఢాకాలో హసీనా తండ్రి , బంగ్లాదేశ్ పిత షేక్ ముజిబుర్ రెహ్మన్ భారీ విగ్రహంపై నిరసనకారులు దాడికి దిగి దీనిని ధ్వంసం చేశారు. దీనిపైకి ఎక్కి గునపాలు, గొడ్డళ్లతో పగుల గొట్టి తల విరగ్టొట్టి కొందరు తీసుకువెళ్లుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి1971 బంగ్లా విముక్తి నేత , దేశ ప్రజల పాలిటి హీరో అన్పించుకున్న ముజిబుర్ రెహ్మన్ పట్ల ఇప్పుడు జనం తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దేశంలోని ధన్మోండి ప్రాంతంలోని ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్ (ఐజిసిసి)ని అక్కడి బంగబంధు స్మారక మ్యూజియంను కూడా అరాచక గుంపు ధ్వంసం చేసింది. .ఢాకా, ధన్మోడి, ఇతర పలు ప్రాంతాలలో అధికార అవామీలీగ్ పార్టీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు.

హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమాల్ నివాసాన్ని తగులబెట్టారు. సోమవారం కూడా పలు ప్రాంతాలలో జరిగిన హింసాత్మక ఘటనలలో ఆరుగురు మృతి చెందారు. హసీనా దేశంలో 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. హింసాత్మక ఘటనలు, వదంతుల నడుమ దేశంలో ఇంటర్నెట్‌పై పూర్తి స్థాయి నిషేధం విధించారు. అయితే మధ్యాహ్నం బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్రసారాలకు అధికార వర్గాల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. సోమవారం నాటి నిరసనలకు జనం వీధుల్లోకి తరలివచ్చిన దశలో వారిని నియంత్రించేందుకు భారీగా పోలీసులు, సైనిక బలగాలు మొహరించాయి. హసీనా వ్యతిరేకులకు , అవామీలీగ్ మద్దతుదార్లకు మధ్య ఘర్షణలు జరిగే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల కర్ఫూను ధిక్కరించి జనం రోడ్లపైకి వచ్చారు.

హసీనా కోటా నిర్ణయంతో రగిలిన చిచ్చు
దేశంలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం తొలుత పలు వర్శిటీల్లో యువత నుంచి నిరసనలకు దారితీసింది. తరువాతి క్రమంలో ఇది పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఘర్షణలు , అరాచకానికి మూలమైంది. ప్రతిభ ప్రాతిపదికను పక్కకు పెట్టి 30 శాతం రిజర్వేషన్ల కోటాను ఉద్యోగాలు, విద్యారంగంలో అమలుపర్చేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయింది. 1971 బంగ్లా విముక్తి యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు కూడా ఈ కోటా వర్తింపచేయడం పెద్ద ఎత్తున దుమారానికి దారితీసింది. భారీ హింసకు , పరస్పర ఘర్షణలకు కారణభూతం అయింది. గడిచిన రెండు రోజుల్లో కోటా వ్యతిరేక ఉద్యమం చివరికి హసీనా హఠావోకు దారితీసింది. శనివారం ఆదివారం జరిగిన ఘర్షణలలో వంద మందికి పైగా మృతి చెందారు. వీరిలో పోలీసులు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News