Sunday, December 22, 2024

షేక్ హసీనా రాజీనామా లేఖ మిస్టరీ..బంగ్లాదేశ్‌లో ఆందోళనలు

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆగ్రహానికి గురైన షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయాక, తాజాగా దేశాధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాంద్‌తో ఆందోళనలు తలెత్తాయి. అధ్యక్షభవనం ‘బంగ్లాభవన్’ ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఈ ఆందోళనకు కారణం షేక్‌హసీనా ‘రాజీనామా లేఖ’. ఆ రాజీనామా లేఖ ఎవరిదగ్గరా లేదనడం ఆందోళనలకు దారి తీసింది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ ఇటీవల ఓ ఇంటర్వూలో “ ఆ రోజు షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు విన్నాను. అయితే దానిని ధ్రువీకరించేందుకు రాజీనామా లేఖసహా నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఎంత ప్రయత్నించినా, ఆ లేఖ లభ్యం కాలేదు.

బహుశా లేఖ ఇచ్చేందుకు ఆమె (షేక్ హసీనా)కు సమయం ఉండక పోవచ్చు. ” అని పేర్కొన్నారు. ఇదే విషయంపై సైన్యాధిపతిని వాకబు చేయగా, ఇదే విధమైన సమాధానం అక్కడ నుంచీ వచ్చిందన్నారు. హసీనా రాజీనామా లేఖ గురించి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై తాత్కాలిక ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు విరుద్ధ ప్రకటనలు చేశారని, ప్రస్తుత న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పేర్కొన్నారు. “ తన వద్ద హసీనా రాజీనామా లేఖ లేదని అంటున్నారు. ఆగస్టు 5న త్రివిధ దళాధిపతుల సమక్షంలో జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో హసీనా రాజీనామా చేశారని, తాను ఆమోదించానని అధ్యక్షుడు చెప్పారు. ఇప్పుడు మాత్రం తనవద్ద ఆ లేఖ లేదని చెబుతున్నారు” అని చెప్పారు.

రాజీనామా లేఖ ఎందుకు ముఖ్యం ?
హసీనా రాజీనామా లేఖ ఎందుకు ముఖ్యం అంటే మొహమ్మద్ యూనస్ నేతృత్వం లోని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని అది చట్టబద్ధం చేస్తుంది. ఆ లేఖ లేకుంటే బంగ్లాదేశ్ లోని అధికారాన్ని చేజిక్కించుకున్న చట్టవిరుద్ధ ప్రభుత్వమవుతుంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. “ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయలేదు. ఆమె ఇంకా సజీవంగానే ఉన్నారు. అందువల్ల యూనస్ ప్రభుత్వం అక్రమమైనది” అని బహిష్కృత బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు. “ బంగ్లాదేశ్‌లో ప్రతివారూ అబద్ధాలు చెప్పారు. హసీనా రాజీనామా చేశారని ఆర్మీ చీఫ్, అధ్యక్షుడు, యూనస్ ఇలా ప్రతివారూ చెప్పారు. కానీ ఎవరూ హసీనా రాజీనామా లేఖను చూడలేదు. భగవంతుడు ఉన్నాడని చెబుతున్నట్టు రాజీనామా లేఖ ఉందని ప్రతివారూ చెబుతున్నారు. కానీ ఎవరూ చూపించడం కానీ రుజువు చేయడం కానీ చేయలేక పోతున్నారు” అని తస్లీమా నస్రీన్ విమర్శించారు.

ఆపద్ధర్మ ప్రభుత్వానికి న్యాయ సలహాదారులైన అసిఫ్ నజ్రూల్ దీనిపై మాట్లాడుతూ అధ్యక్షుడు షహబుద్దీన్ తన ప్రసంగంలో హసీనా రాజీనామా చేశారని , తాను ఆ లేఖ తీసుకున్నానని ఆగస్టు 5 రాత్రి టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన కొన్ని గంటల తరువాత ఇది జరిగింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు తన ప్రసంగం లో కానీ, లేదా ఇప్పుడు కానీ అబద్ధమాడుతున్నారని తెలుస్తోంది. ” అని నజ్రూల్ ఆరోపించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ఆందోళనలతో అట్టుడికి పోగా అవి హింసాత్మకంగా మారడంతో దాదాపు 300 మంది నిరసన కారులు ప్రాణాలు కోల్పోయారు. షేక్ హసీనా అధికార నివాసాన్ని ఆందోళన కారులు ముట్టడించిన తరువాత ఆగస్టు 5న దేశాన్ని హసీనా విడిచిపెట్టి భారత్‌లో ఆశ్రయం పొందారు. ఆ తరువాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి , పరిస్థితులు కుదుటపడుతోన్న సమయం లోనే హసీనా రాజీనామా లేఖపై అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆందోళనలకు దారి తీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News