Thursday, January 23, 2025

హసీనాను మా దేశానికి పంపించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ వినతి

- Advertisement -
- Advertisement -

ఢాకా: పదవీచ్యుతురాలైన ప్రధాని షేఖ్ హసీనాను ఢాకాకు తిప్పి పంపించవలసిందిగా కోరుతూ భారత్‌కు ఒక దౌత్య పత్రం పంపినట్లు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. విద్యార్థుల సారథ్యంలో నిరసనలతో తన 16 సంవత్సరాల ప్రభుత్వం పతనమైన నేపథ్యంలో 77 ఏళ్ల హసీనా ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి పరారై భారత్‌లో ప్రవాస జీవితం సాగిస్తున్న విషయం విదితమే. ‘మానవాళిపై సాగించిన నేరాలకు, మారణకాండకు’ హసీనాపైన, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక, పౌర అధికారులపై బంగ్లాదేశ్ కేంద్రంగా గల అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసిటి) అరెస్టు వారంట్లు జారీ చేసింది. ‘న్యాయ ప్రక్రియ కోసం ఆమెను ఢాకాకు తిరిగి పంపించవలసిందిగా బంగ్లాదేశ్ కోరుతోందని అంటూ మేము భారతీయ ప్రభుత్వానికి ఒక దౌత్య పత్రం పంపాం’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ సలహాదారు తౌహిద హొస్సేన్ తన కార్యాలయంలో విలేకరులతో చెప్పారు.

భారత్ నుంచి పదవీచ్యుతురాలైన ప్రధాని అప్పగింతకు వీలుగా విదేశాంగ మంత్రిత్వశాఖకు తన కార్యాలయం ఒక లేఖ పంపిందని హోమ్ శాఖ సలహాదారు జహంగీర్ ఆలమ్ సోమవారం ఉదయం తెలిపారు. ‘ఆమె అప్పగింత విషయమై విదేశాంగ మంత్రిత్వశాఖకు మేము ఒక లేఖ పంపాం. ఆ ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఢాకా, న్యూఢిల్లీ మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, దాని కింద హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకురావచ్చునని ఆలమ్ తెలిపారు. మధ్యంతర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి క్రితం నెల బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ ప్రసంగిస్తూ, హసీనా అప్పగింతను తాము కోరతామని చెప్పారు. ‘ప్రతి హత్యలో న్యాయం జరిగేలా మేము చూడాలి&. పదవీచ్యుతురాలైన నియంత షేఖ్ హసీనాను తిరిగి పంపించాలని భారత్‌ను అడుగుతాం కూడా’ అని ఆయన తెలిపారు.

ఆగస్టు 8న అధికార బాధ్యతలు చేపట్టిన యూనస్ ఆమె ప్రభుత్వంపై నిరసనల సమయంలో విద్యార్థులు, కార్మికులతో సహా దాదాపు 1500 మంది మరణించారని, 19931 మంది గాయపడ్డారని తెలియజేశారు. ఒప్పందంలోని ఏ నిబంధననైనా ఉటంకిస్తూ హసీనా అప్పగింతకు భారత్ నిరాకరించే యత్నం చేస్తే బంగ్లాదేశ్ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తుందని న్యాయ శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అక్టోబర్‌లో చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, తన పదవీచ్యుతి దరిమిలా మైనారిటీలను, ముఖ్యంగా హిందువులను కాపాడడంలో యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం విఫలమవుతోందని, ‘మారణకాండ’ సాగిస్తోందని హసీనా ఇటీవలి వారాల్లో ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News