Tuesday, September 17, 2024

సైన్యం చేతికి బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో గత రెండు నెలలుగా చోటు చేసుకున్న పరిణామాలు చివరకు ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతికి దారితీశాయి. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విపక్షాలతో చేతులు కలిపి, మిలిటరీ ప్రభుత్వంపై పోరాటం సల్పి తండ్రికి తగ్గ తనయగా పేరు పొందిన హసీనా.. తన నియంతృత్వ పోకడలతో దేశం మళ్లీ సైన్యం చేతుల్లోకి వెళ్లడానికి కారకురాలు కావడం శోచనీయం. ఉద్యోగ నియమాకాల్లో రిజర్వేషన్ల విధానం హసీనా పదవికి ఎసరు పెట్టిందని చెప్పాలి. విద్యార్థుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకుని, పరిష్కరించవలసిన బంగ్లా ప్రభుత్వం మొదటి నుంచీ ఉద్యమాన్ని అణచివేసేందుకే ప్రయత్నించింది.

నిరనసకారులు హింసాయుత విధానాలకు పాల్పడుతుంటే, అధికార అవామీలీగ్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఉద్యమకారులపై దాడులకు పాల్పడుతూ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. ఫలితంగా రిజర్వేషన్ల ఉద్యమంలో 300 మంది అసువులు బాయడం ప్రభుత్వానికి అప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. బంగ్లా విముక్తి పోరాటం తర్వాత దేశంలో ఇంత పెద్దయెత్తున హింస చెలరేగడం ఇదే మొదటిసారని ప్రజాస్వామికవాదులు గగ్గోలుపెట్టినా, వారిది కంఠశోషగానే మిగిలిపోయింది. బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు కల్పించిన రిజర్వేషన్ల కోటాకు నిరసనగా రెండు నెలల క్రితం ఢాకా యూనివర్శిటీలో మొదలైన ఉద్యమం దేశమంతటికీ పాకి, తీవ్రరూపం దాల్చింది. ఈ రిజర్వేషన్ల కోటాలో కోత విధించేందుకు అటు ప్రభుత్వామూ, ఇటు సర్వోన్నత న్యాయస్థానమూ అంగీకరించడంతో, ఉద్యమానికి ఓ పరిష్కారం దొరికిందనుకుంటున్న నేపథ్యంలో మళ్లీ నాలుగు రోజుల కిందట వెల్లువలా ఎగసింది.

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. గత రెండు రోజుల్లో సుమారు 100 మందికి పైగా ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారంటే ఈ ఉద్యమం ఎంతటి హింసాయుత రూపం దాల్చిందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న స్టూడెంట్స్ ఎగైనిస్ట్ డిస్క్రిమినేషన్ గ్రూపు.. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా, బిల్లులు చెల్లించకుండా శాసనోల్లంఘన చేయాలంటూ పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలోపడింది. తాజాగా సోమవారంనాడు హసీనా అధికారిక నివాస గృహాన్ని నిరసనకారులు చుట్టుముట్టి, విధ్వంసానికి పాల్పడటంతో పరిస్థితి పూర్తిగా చేజారింది. హసీనా తన పదవికి రాజీనామా చేసి పలాయనం చిత్తగించవలసివచ్చింది.

బంగబంధుగా పేరుగాంచిన ఒకప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు ముజిబుర్ రెహ్మాన్ కుమార్తెగా తండ్రినుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగిన హసీనా మొన్న జనవరిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధాన పదవిని చేపట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో హసీనా గెలుపు నల్లేరుపై నడకైంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలబడతానని చెప్పుకునే హసీనా నియంతృత్వ పోకడలను పుణికిపుచ్చుకుని, తన అధికారానికి రాచబాటలు వేసుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా అణగదొక్కేందుకు భద్రతా దళాలను సైతం వినియోగించుకునేవారు. ఆ క్రమం లో మానవ హక్కులను కాలరాసేందుకు కూడా ఆమె వెనుకాడలేదు. విద్యార్థుల ఉద్యమంపై కూడా తనదైన శైలిలో ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించి బొక్కబోర్లాపడ్డారు. ఉద్యమకారులను రజాకార్లుగా, ఉగ్రవాదులుగా అభివర్ణించడం విద్యార్థులను మరింత రెచ్చగొట్టింది. ప్రధాని ఆదేశాలతో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన సైన్యానికి చివరికి తత్వం బోధపడింది. ఉద్యమం చల్లారకపోగా రానురాను తీవ్రరూపం దాల్చడంతో సైన్యం వెనక్కితగ్గింది.

ఇకపై ఉద్యమకారులపైకి ఒక్క బులెట్ కూడా ప్రయోగించబోమని, ప్రజల పక్షానే సైన్యం నిలబడుతుందని ఆర్మీ చీఫ్ సోమవారం ఉదయం ప్రకటన చేయడంతోనే ఉద్యమకారులకు, సాధారణ ప్రజానీకానికి కూడా ఏం జరగబోతోందో చూచాయగా అర్ధమైంది. ఆ వెనువెంటనే జరిగిన రాజకీయ పరిణామాలలో హసీనా తన సోదరితో కలసి తలదాచుకునేందుకు సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోగా, అధికారం సైన్యం హస్తగతమైంది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, పరిస్థితి అదుపులోకి వస్తే ఎమర్జెన్సీ విధించబోమని సైన్యాధ్యక్షుడు వాకర్ ఉజ్ జమాన్ చేసిన ప్రకటన స్వాగతించదగినదే అయినా దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సైన్యం ఎంత త్వరగా చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News