Sunday, December 22, 2024

ఢాకాలో నిరసనకారులపై భద్రత బలగాల కాల్పులు

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ పోలీస్, భద్రత అధికారులు శుక్రవారం రాజధాని ఢాకాలో నిరసనకారులపై తూటాలు, బాష్పవాయువు ప్రయోగించారు. రాజధానిలో జనం గుమిగూడడాన్ని కూడా నిషేధించారు. ప్రభుత్వోద్యోగాల కేటాయింపుపై రోజుల తరబడి ప్రాణాంతక ఘర్షణల తరువాత ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను నిలిపివేశారు. జనవరిలో ఎన్నికల అనంతరం వరుసగా నాలుగవ సారి అధికార బాధ్యతలు స్వీకరించిన ప్రధాని షేక్ హసీనాకు కొన్ని వారాల క్రితం మొదలై సోమవారం ఉద్ధృత స్థాయికి చేరిన నిరసనలు అతిపెద్ద సవాల్‌గా పరిణమించాయి. ప్రధాన ప్రతికూల పార్టీలు ఆ ఎన్నికలను బహిష్కరించాయి. తాజా సంఘర్షణల్లో మరి నలుగురు మరణించినట్లు స్థానిక టివి చానెల్ సమయ్ టివి వెల్లడించింది. అత్యంత హింసాత్మక ప్రదర్శనల్లో 22 మంది మృతి చెందిన మరునాడు శుక్రవారం ఇది జరిగిందని స్థానిక మీడియా తెలియజేసింది. మరొక వైపు నిరసనకారులైన విద్యార్థులు దేశంలో ‘పూర్తి బంద్’ పాటించే యత్నం చేశారు. అయితే, మరణాలకు సంబంధించిన గణాంకాల నిర్ధారణకు అధికారులు వెంటనే అందుబాటులోకి రాలేదు.

ఈ సంక్షోభం బంగ్లాదేశ్ పాలన. ఆర్థికవ్యవస్థలోని లోపాలను. మేలైన ఉద్యోగాల కొరత ఎదుర్కొంటున్న యువ పట్టభద్రుల్లోని నైరాశ్యాన్ని ఎత్తిచూపుతోంది. క్యాంపస్‌ల మూసివేతకు, నిరసనల అణచివేతకు రాజధాని వ్యాప్తంగా పోలీస్, పారామిలిటరీ బలగాలను ప్రభుత్వం మోహరించింది. బుధవారం దేశంలోని అతిపెద్ద వర్శిటీతో సహా విశ్వవిద్యాలయాలు తరగతులను సస్పెండ్ చేసి, డార్మిటరీలను మూసివేశాయి. రాజధానిలో అన్ని సమావేశాలను, ప్రదర్శనలను నిషేధిస్తున్నామని శుక్రవారం ఢాకా పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ టెలివిజన్ ప్రధాన కార్యాలయం వెలుపల సమీకృతమైన వెయ్యి మందికి పైగా నిరసనకారుల సమూహంపై బోర్డర్ గార్డ్ అధికారులు కాల్పులు జరపడాన్ని ఎపి వార్తా సంస్థ విలేకరి చూశారు. అంతకుముందు రోజు బంగ్లాదేశ్ టివి కార్యాలయంపై నిరసనకారులు దాడి జరిపి, దానికి నిప్పు అంటించారు. ఇంటర్నెట్ సర్వీసులు, మొబైల్ డేటా గురువారం రాత్రి నుంచి పని చేయడం లేదు.

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు కూడా పని చేయలేదు. వాటికి తోడు శుక్రవారం ఇంటర్నెట్‌కు అంతరాయం వాటిల్లడంతో బంగ్లాదేశ్‌లో ఆ ప్రభావం మరింత ఎక్కువగా కానవచ్చింది. 1971లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వెటరన్ల బంధువులకు 30 శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వ్ చేస్తున్న కోటా విధానానికి స్వస్తి పలకాలని నిరసనకారులు కోరుతున్నారు. అయితే, ప్రధాని షేక్ హసీనా కోటా విధానాన్ని సమర్థిస్తున్నారు. పార్టీ అనుబంధంతో నిమిత్తం లేకుండా తమ సేవలకు అత్యున్నత గౌరవానికి వెటరన్లు అర్హులని ఆమె అంటున్నారు. ప్రైవేట్ రంగంలో కొన్ని చోట్ల ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పటికీ అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలను ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మరింత సుస్థిరమైనవని, వేతన పరంగా ప్రోత్సాహకరమైనవని వారు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News