సరిహద్దు ఉద్రిక్తతలు కారణం
ఢాకా : సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం సమన్ చేసింది. ద్వైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా భారత బంగ్లాదేశ్ సరిహద్దు పొడుగునా ఐదు చోట్ల కంచె నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని ఢాకా ఆరోపించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకున్నది. వర్మ మధ్యాహ్నం సుమారు 3 గంటలకు మంత్రిత్వశాఖ కార్యాలయంలోకి వెళుతూ కనిపించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి జషిమ్ ఉద్దీన్‌తో ఆయన సమావేశం సుమారు 45 నిమిషాల సేపు జరిగింది.
వారి మధ్య చర్చల గురించి మధ్యంతర ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కానీ హైకమిషనర్‌ను సమన్ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే, సమావేశం అనంతరం మీడియాతో వర్మ మాట్లాడుతూ, ఢాకా, న్యూఢిల్లీ మధ్య ‘భద్రత కోసం సరిహద్దులో కంచె వేసే విషయమై అవగాహనలు ఉన్నాయి’ అని తెలియజేశారు. ‘మా రెండు సరిహద్దు కాపలా సంస్థలు బిఎస్‌ఎఫ్, బిజిబి ఈ విషయమై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాయి. ఈ అవగాహనను అమలు జరుపుతారని, సరిహద్దు పొడుగునా నేరాల కట్టడికి సహకారాత్మక దృక్పథం అనుసరిస్తారని ఆశిస్తున్నాం’ అని వర్మ తెలిపారు.