Thursday, November 14, 2024

ఓటమి దిశగా న్యూజిలాండ్..

- Advertisement -
- Advertisement -

సిల్హేట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. 332 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 113 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కివీస్ శనివారం చివరి రోజు మరో 219 పరుగులు చేయాలి. ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోవడంతో కివీస్ ఓటమిని తప్పించుకోవడం చాలా కష్టంతో కూడిన విషయంగా చెప్పాలి. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షాంటో (105) శతకంతో జట్టును ఆదుకున్నాడు. ముష్ఫికుర్ రహీం (67), మెహదీ హసన్ మీరాజ్ 50 (నాటౌట్)లు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఏజాజ్ పటేల్ నాలుగు, ఐష్ సోధి రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ టామ్ లాథమ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

మరో ఓపెనర్ డేవోన్ కాన్వే (22) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. జట్టును ఆదుకుంటారని భావించిన కేన్ విలియమ్సన్ (11), హెన్రీ నికోల్స్ (2) కూడా నిరాశ పరిచారు. వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ (6), గ్లెన్ ఫిలిప్స్ (12), కైల్ జేమిసన్ (9) కూడా విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా డారిల్ మిఛెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆట ముగిసే సమయానికి మిఛెల్ 44 పరుగులతో క్రీజులో నిలిచాడు. అతనికి ఐష్ సోధి 7 (బ్యాటింగ్) అండగా ఉన్నాడు. కాగా, బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ నాలుగు వికెట్లు తీశాడు. మెహదీ హసన్, షరిఫుల్ ఇస్లామ్, నయీం హసన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 317 పరుగులకు ఆలౌటైంది. మరోవైపు ఇప్పటికే ఏడు వికెట్లను పడగొట్టిన బంగ్లాదేశ్ మిగిలిన బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించి చారిత్రక విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News