న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఓ వైపు హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి విపక్ష నాయకుడు హిందూ శాస్త్రాలపై విమర్శలు గుప్పించాడు. ప్రతిపక్ష అగ్రనేత, గొనో ఓధికార్ పరిషద్ కన్వీనర్ అయిన తారీఖ్ రహ్మాన్ ‘హిందూ ధర్మ శాస్త్రాలను బూతు పుస్తకాలు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాక అతడు బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై విమర్శలు గుప్పించాడు. అంతేకాదు హిందూ ధర్మశాస్త్రాలు నైతికతను బోధించవన్నాడు. అతడు ‘ఫేస్‌బుక్’లో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆ వీడియోను ఇప్పుడు చాలా మంది షేర్ చేసుకున్నారు. తారీఖ్ రహ్మాన్ ప్రతిపక్ష నాయకుడు నూరుల్ హఖ్ నూర్‌కు అత్యంత సన్నితుడు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో షేఖ్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని నూరుల్ హఖ్ నూర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
గొనో ఓధికార్ పరిషద్‌ను 2021 అక్టోబర్‌లోనే ప్రారంభించారు. అందులో పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ యువకులు, సామాజిక కార్యకర్తలు నాయకులుగా ఉన్నారు. అంతేకాక ఆ గ్రూప్‌కు ఉగ్రవాద సంస్థ అయిన జమాతె ఇస్లామీ నుంచి మంచి మద్దతు ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. జమాతె ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ తీవ్రవాద నాయకులకు మద్దతునిస్తున్నాయి. పైగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అంతేకాదు షేఖ్ హసీనా ప్రభుత్వంపై విద్వేష ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు.