Friday, December 20, 2024

గిరిజన చైతన్యదీపిక

- Advertisement -
- Advertisement -

బంజారాలకి వున్నన్ని పేర్లు మరే తెగకి లేవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించిన తెగకూడా ఇదే. అయినా సంస్కృతీ సంప్రదాయాలు, భాష, అంతటా ఒకటే. హంగేరీఆస్ట్రియ, రొమేనియ, ఉక్రెయిన్, వంటి 67 దేశాలలోని రోమాజిప్సీ తెగవారు తాము భారత దేశం నుండి వచ్చామని చెప్పుకుంటారు. ఆ రకంగా బంజారాలు పర దేశాల్లో కూడా జీవిస్తున్నారు. బంజారాలు తండాల్లో జీవిస్తారు. బంజారాల బతుకంతా నిత్యపోరాటమే. వారు ప్రకృతితో, పరిసరాలతో పోరాడాలి. నిత్య సంచారం వల్ల స్థానిక ప్రభుత్వాలతో పోరాడాలి. ఇది వారి బతుకు కష్ట జీవులైన బంజారాలు తమ కుటుంబంతో ఊరూరా తిరుగుతు సరుకులు సరఫరా చేసేవారు. మధ్యకాలాల్లోని పృధ్వీరాజ్ చౌహాన్ సంతతి వారమని చెప్పుకునే బంజారాలు రాజస్థాన్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. వీరికొక్కరికే భారతీయ పౌరాణిక మూలాలు లేవు.

వాటి ప్రభావాన్నుంచి వారు దూరం వున్నారు. వారి అనాది మూల పురుషుల కాల్పనిక చరిత్ర కూడా జత కలవలేదు. ఒకనాటి అఖండ భారత ఖండంలోని అఫ్ఘానిస్తాన్ ప్రాంతం నుండి మన దేశానికి వచ్చారని చరిత్రకారుల భావన. బంజారాలకు దైవాలు ఎక్కువగా లేరు. అలాంటి సందర్భంలో 1741లో తెలుగునేల మీద జన్మించిన సంత్ సేవాలాల్ గురించి తెలుసుకోవడం అవసరం. బంజారాలు మొదటి నుండి వీరయోధులు. బానిసత్వాన్ని వ్యతిరేకించడం వీరి నైజం. సంత్ గురు గోబింద్‌సింగ్‌తో ఉత్తర భారత దేశం నుండి వచ్చిన బంజారాలు కొంత మంది నాందేడ్ నుండి కన్నడ ప్రాంతానికి తరలివెళ్లారు. ఆనాడు కర్నాటక రాష్ట్రానికి చెందిన బళ్లారి జిల్లాలో ఉన్న గుత్తికి దగ్గర గల ప్రాంతంలో అలా తరలివచ్చిన వారి కుటుంబంలో పుట్టాడు. అక్కడే సంత్ సేవాలాల్ పాత గుడి ఒకటి ఉంది. అతను బాల బ్రహ్మచారి. బంజారా సమాజానికి ఒక దిశానిర్దేశం చేయాలని భావించాడు. తాము ఇక్కడకు వచ్చినప్పటి నుండి ఆంగ్లేయులు తమని కష్టాలకు గురిచేస్తున్న విషయం గమనించాడు వారు తమ కోసం వేసుకుంటున్న రైలు, రోడ్లు తమ రాకపోకలకు అంతరాయం కల్పించడం గమనించారు.

పన్నులు వసూలు చేయడం కోసం కాంచీటీలు (డబ్బు రసీదు కేంద్రాలు) ఏర్పాటు చేయడం వారికి ఏమాత్రం రుచించలేదు. తమ వృత్తి మీద దెబ్బ కొట్టడానికే అలా చేస్తున్నారని భావించి వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన బంజారాలను జైళ్లలో పెట్టడం, శిక్షల పేరుతో ఉరి తీయడం వారిని కలచివేసింది. ఆ సందర్భంలోనే వీరిని ‘నేరస్థ జాతి’గా పరిగణించడం బాధకు గురి చేసింది. తమ సంప్రదాయ వ్యాపారం దెబ్బ తినడం వల్ల గోవులను మేపుకుని బతకడమే బతుకుతెరువైంది. బంజరు భూములలో పశువులను మేపుకొనడానికి అధిక రుసుము వసూలు చేయడం మొదలైంది. సేవాలాల్ ముందు బంజారా సమాజాన్ని సంస్కరించాలని అనుకున్నాడు. వ్యాపార సంచారం ఆపి వ్యవసాయం వైపు దృష్టిని మరల్చాలి.

దురలవాట్లుంటే ఆ పని చేయలేరు. సంచారమే జీవితమైనప్పుడు రుతువులను అనుసరించిన పండగలు, తన పూర్వీకులు వచ్చిన దారిలోనే నాందేడ్ (హైదరాబాద్ సంస్థానం), మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ వంటి ప్రాంతాలకు వెళ్లి తన బోధనలను వినిపించాడు. తిరుపతిలోని హాథీరాం బాలాజీ (1832-1928) వంటివారికి గురుతుల్యునిగా వున్న సేవాలాల్ బంజారా సమాజానికి తొలి ఆధునిక వేగుచుక్క. మారుతున్న కాలాన్నిబట్టి బంజారాలు ఆధునిక సమాజ పౌరులుగా తీర్చిదిద్దడానికి అతని సంచార జీవితమే ప్రధాన అనుభవ భూమిక అయింది. అయితే తమ మూలాలను కాపాడుకోవడానికి బంజారాలు చేసిన ప్రయత్నం తక్కువేమీ కాదు. గత సంస్కృతి, ఆధునిక అవసరాల మధ్య తమ జీవిత విధానాన్ని కాపాడుకున్నారు. ప్రకృతితో మమేకమై అందులోనే జీవించిన తెగ, ఇప్పుడు అందుకు దూరం కావడం వల్ల పరాయీకరణకు లోనవుతున్నారు. ఉన్నతీకరణ, సంస్కృతీకరణ ప్రభావంతో తమని తాము కోల్పోవాల్సి రావడం శాపమే.

ఇది సేవాలాల్ బోధనలకి వ్యతిరేకం. సేవాలాల్‌ని ఒక దైవంగా మాత్రమే గుర్తించే చైతన్యానికి చేరువై, అతని అసలు సందేశాలను గుర్తించకపోవడం సేవాలాల్‌కి వ్యతిరేకం. ఒక ప్రాంతం లో ఉన్నత కులం క్షత్రియులుగా, మరో ప్రాంతంలో వీరులుగా, వెనుకబడినవారుగా, రెండు తెలుగు రాష్ట్రాలలో గిరిజనులుగా రకరకాల సామాజిక స్థాయి గుర్తింపు కలిగి వుండ డం వారికి గుదిబండగానే వుంటుంది. లంబాడీలని, సుగాలీలని, లమణులని, గోర్‌మాటీలని ఎన్నో రకాలుగా పిలవబడడం సరికాదు. ఈ విషయాలపై బంజారా సమాజం, అత్యున్నత ధర్మపీఠం ఆలోచించి సమరూపత సాధించాలి. అందరికీ వర్తించేలా ఒకే పేరుని ఖరారు చేసుకోవలసి ఉంది. పాత వృత్తిస్థానే విద్య, ఉద్యోగం, అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్న బంజారా సమాజం పూర్వశక్తిని, బాధ్యతని సంతరించుకోవాలి. తమ ప్రత్యేకతని, జీవన విధానాల విలువలను కాపాడుకుని బంజారా జాతి ప్రతిపత్తి కాపాడుకుంటు సంత్ సేవాలాల్ స్ఫూర్తితో ముందుకువెళ్లాలి.

* జె. హనుము,
851983 6308

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News