Friday, November 22, 2024

రూ.220కోట్ల భూకబ్జా యత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ వెనుక 20 ఎకరాల స్థలంపై కన్నేసిన కృష్ణ గ్రూప్
బోగస్ పత్రాలు సృష్టి, అడ్డుకున్న అధికారులపై కబ్జాదారుల జులుం, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు

మన తెలంగాణ/పంజాగుట్ట: నగరం నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయతించిన వారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ నెం12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు అతి సమీపంలో ఉన్న రూ.220 కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు మరోసారి చేసిన ప్రయత్నాలను రెవెన్యూ సిబ్బంది అడ్డుకుని అక్రమ నిర్మాణాలను తొలగించారు. తమ స్థలంలోకి ఎలా వస్తారంటూ కబ్జాదారులు షేక్‌పేట మండల సిబ్బందిని దబాయించడంతో పాటు మీ సంగతి తేలుస్తామంటూ వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పిలో టీఎస్ నెంబర్ 1లోని బ్లాక్ హెచ్, వార్డు 10లో బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ వెనకాల సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. నాలుగేళ్ల క్రితమే ఈ స్థలం చుట్టూ రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో రెండున్నర ఎకరాలను తాము రాఘవరావు అనే వ్యక్తివద్ద నుంచి కొనుగోలు చేశామంటూ కృష్ణా గ్రూపు పార్ధసారధి బోగస్ పత్రాలు సృష్టించారు. టీఎస్‌ఎలెర్ రికార్డుల్లో ఫోర్జరీ పత్రాలను తయారు చేశారు. దీంతో పాటు బోగస్ పహాణీలు సృష్టించడంతోపాటు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గదిని సైతం నిర్మించడంతో గత నెల 23న షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది అక్కడకు వెళ్లి స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పార్ధసారధి తదితరులపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి స్థలం చుట్టూ రేకులు ఏర్పాటు చేసి ఆక్రమణకు యత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని రేకులను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న పార్ధసారధితో పాటు అతడి తరపున న్యాయవాది దివాకర్‌రావు రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ మేరకు కృష్ణా గ్రూపు పార్ధసారధి, న్యాయవాది దివాకర్ రావు తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ షేక్‌పేట మండల డిప్యుటీ తహసీల్దార్ (ల్యాండ్ ప్రొటెక్షన్) సందీప్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు. చేశారు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ భూమికి చెందిన రికార్డులను ఫోర్జరీ చేయడంతో పాటు అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బెదిరింపులకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల కార్యాలయ సిబ్బంది ఫిర్యాదులో కోరారు.

Banjara Hills Police filed case against Krishna Group

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News