న్యూఢిల్లీ : బ్యాంకుకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే త్వరగా దాన్ని పరిష్కరించుకోండి. ఎందుకంటే ఈ వారం ఆఖరున డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఈ సమ్మె చేపడుతోంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే వివిధ మార్గాల్లో వ్యతిరేకిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబిఒసి) ప్రధాన కార్యదర్శి సంజయ్ దాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్‌బిఐ సేవలకు ఎఫెక్ట్
సమ్మె రోజున ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తెలిపింది. సమ్మె రోజు బ్యాంకు వ్యాపారం ప్రభావితం కావచ్చని బ్యాంక్ పేర్కొంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌లో ఈ ఏడాది ప్రారంభంలో రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్షం ఉందని, దీని కింద రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నామని తెలిపారు. 2019లో ప్రభుత్వం ఐడిబిఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటాను ఎల్‌ఐసికి విక్రయించడం ద్వారా ఐడిబిఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది. దీంతోపాటు గత నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేశారు.