శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో సామాన్య పౌరులు, మైనార్టీలపై ఉగ్రవాదుల దాడులు ఆగట్లేదు. మొన్నటికి మొన్న ఓ టీవీ నటి, ఆ తరువాత టీచర్ ఉగ్రవాదుల దాడికి బలికాగా, తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ ప్రాణాలను కడతేర్చారు. దక్షిణ కశ్మీర్ లోని కుల్గామ్ జిలా మోహన్ పొరా ప్రాంతంలో ఎల్లాఖీ దేహతి బ్యాంకు లో గురువారం ఉదయం కొందరు ఉగ్రవాదులు చొరబడి బ్యాంకు మేనేజర్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మేనేజర్ విజయ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయినట్టు కశ్మీర్ పోలీసులు తెలిపారు. విజయ్ స్వస్థలం రాజస్థాన్ లోని హనుమాన్ నగర్. కశ్మీర్ లో మైనార్టీలను లక్షంగా చేసుకుని కాల్పులు జరపడం మూడు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. తాజా ఘటనను పలువురు రాజకీయ ప్రముఖులు ట్విటర్ వేదికగా ఖండిస్తున్నారు. మృతుడు విజయ్ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు. ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరులపై ఉగ్రవాదుల దాడులను సహించకూడదని, కశ్మీర్‌లో పౌరులకు కేంద్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని ఆయన ట్విటర్ వేదికగా కోరారు.