Monday, January 20, 2025

అమెరికా బ్యాంకుల పతనం

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కూలిపోయింది, తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ అదే బాట పట్టింది. ఇప్పుడు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్, వెస్ట్రన్ అలయన్స్ బ్యాంక్ కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్షియల్ కార్ప్, యుఎంబి ఫైనాన్షియల్ కార్ప్, జియోన్ బ్యాంక్ కార్ప్, కొమెరికా ఇంక్‌లను ఇన్సూరెన్స్ చేయని డిపాజిట్ ఫండింగ్‌పై ఆధారపడటం వలన వాటిని డౌన్‌గ్రేడ్ చేయడానికి సమీక్ష కోసం ఉంచింది. ఈలోగా అమెరికా ప్రభుత్వం ఎస్‌విబి డిపాజిటర్లను రుణదాతల ఫైనాన్సింగ్‌కు మద్దతుగా కొత్త రుణ సదుపాయం ద్వారా ఆదుకొంది. ఇది తదుపరి బ్యాంక్ వైఫల్యాలను ఆపివేస్తుందని ఆశిస్తోంది. 2008 నుండి 2012 మధ్య, అమెరికాలో 465 కంటే ఎక్కువ ప్రైవేట్ బ్యాంకులు విఫలమయ్యాయి. భారత దేశంలోని రిజర్వ్ బ్యాంకుకు సమానమైన ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ద్వారా కొన్నింటిని అమెరికా ప్రభుత్వం ఎంపిక చేసి కాపాడింది.

ప్రభుత్వం బ్యాంకులను రక్షించడాన్ని నిరోధించేందుకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు (ఎఫ్‌ఎస్‌బి)ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డు అంతర్జాతీయ సంస్థలలో ఒక ప్రత్యేకమైన కూర్పును కలిగి ఉంది. ఎందుకంటే ఇది జి 20 దేశాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖలు, కేంద్ర బ్యాంకులు, పర్యవేక్షక, నియంత్రణ అధికారుల నుండి సీనియర్ పాలసీ రూపకర్తలను ఒక చోట చేర్చింది.మరో నాలుగు ఇతర కీలక ఆర్థిక కేంద్రాలు హాంకాంగ్, సింగపూర్, స్పెయిన్, స్విట్జర్లాండ్ కూడా చేరాయి. అదనంగా, ఇది స్టాండర్డ్- సెట్టర్‌లు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ కమిషన్ వంటి ప్రాంతీయ సంస్థలతో సహా అంతర్జాతీయ సంస్థలను కలిగి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఆర్థిక స్థిరత్వ విధానాలను నిర్ధారించే ప్రధాన ఆటగాళ్లందరూ ఒకే టేబుల్‌లో ఉన్నారని దీని అర్థం.

కాబట్టి విధానాలు అంగీకరించినప్పుడు, వాటిని అమలు చేసే అధికారం కూడా వారికి ఉంటుంది. బ్యాంకులను కాపాడేందుకు ప్రభుత్వం డబ్బు పంప్ చేయదని, డిపాజిటర్లు నష్టాలను భరించాలని ఎఫ్‌ఎస్‌బి స్పష్టంగా నిర్ణయించింది. కానీ ప్రధానంగా వెంచర్ క్యాపిటలిస్టులుగా ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పెట్టుబడిదారులను రక్షించడానికి అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవలసి రావడం దాని వైఫల్యాన్ని సూచిస్తుంది. ఈ బ్యాంకులు ఏవీ అవినీతి, అక్రమాలకు పాల్పడి కూలిపోలేదు. తప్పుడు ప్రభుత్వ విధానాలు, అసమర్ధపు నిర్వహణ కారణంగా కూలిపోయాయని గమనించాలి. వెంచర్ క్యాపిటల్ అనేది ప్రైవేట్ ఈక్విటీ మరో రూపం. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్న స్టార్టప్ కంపెనీలు, చిన్న వ్యాపారాలకు అందించే ఒక రకమైన ఫైనాన్సింగ్. వెంచర్ క్యాపిటల్ సాధారణంగా మంచి పెట్టుబడిదారులు, పెట్టుబడి బ్యాంకులు, ఏదైనా ఇతర ఆర్థిక సంస్థల నుండి వస్తుంది.

వెంచర్ క్యాపిటల్ ఎల్లప్పుడూ డబ్బుగా ఉండవలసిన అవసరం లేదు. వాస్తవానికి, ఇది తరచుగా సాంకేతిక లేదా నిర్వాహక నైపుణ్యంగా వస్తుంది. వెంచర్ క్యాపిటల్ సాధారణంగా అసాధారణమైన వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న కంపెనీలకు లేదా త్వరగా వృద్ధి చెందడానికి, విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించే వాటికి కేటాయించబడుతుంది. ఈ వెంచర్ క్యాపిటల్స్ తక్కువ సమయం లో భారీ లాభాలను అంచనా వేసినప్పుడు స్టార్టప్‌లకు నిధులు సమకూరుస్తాయి. మంచి లాభాలు రాగానే నిష్క్రమిస్తారు. ఇది కేవలం జూదం మాత్రమే. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విషయంలో కూడా వెంచర్ క్యాపిటల్‌లు స్టార్టప్‌లపై దృష్టి సారించిన ఎస్‌విబి లో పెట్టుబడిపెట్టారు. ఇప్పుడు వారి వేళ్లు కాలిపోయాయి.ఇజ్రాయెల్, చైనాలలో స్టార్టప్‌లకు నేరుగా ప్రభుత్వం లేదా డెవలప్‌మెంట్ బ్యాంకుల ద్వారా నిధులు సమకూరుస్తాయి. వారి మనుగడ రేటు 15% మాత్రమే.

భారతదేశంలో వారు బ్యాంకులు, వెంచర్ క్యాపిటల్‌పై ఆధారపడతారు. ఇప్పుడు భారత దేశంలో స్టార్టప్‌లకు నిధుల వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గించాలనే లక్ష్యంగా అమెరికా ప్రభుత్వం బ్యాంకుల వడ్డీ రేట్లను పెంచుకుంటూపోతూ ఉండడంతో ఎస్‌విబి తమ వద్దఉన్న డిపాజిట్లకు ఎక్కువ వడ్డీలు చెల్లించవలసి వచ్చింది. కానీ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో బ్యాంకు నుండి రుణాలు తీసుకొనేవారు తగ్గిపోతూ ఉండడంతో ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకోవలసి వచ్చింది. మన దేశంలో సహితం బ్యాంకుల నిర్వహణ లోపభూయిష్టంగానే ఉంది.

వాస్తవానికి అమెరికాలో ఆర్ధిక నియంత్రణ వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉంటాయి. బ్యాంకుల నియంత్రణ విధానాలు సహితం కఠినంగా ఉంటాయి. మన దేశంలోని సెబి, ఆర్‌బిఐ వంటి సంస్థల మాదిరిగా వాటిల్లో అంతగా రాజకీయ జోక్యం గాని, కార్పొరేట్ల ఒత్తిడులు గాని ఉండవు. అయినా ఈ విధంగా బ్యాంకులు కుప్పకూలిపోతూ ఉండడం చూస్తుంటే ఆయా బ్యాంకులు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని స్పష్టం అవుతుంది. రిటైల్ రుణాలకు డిమాండ్ తగ్గిపోవడంతో ఎస్‌విబి అత్యధిక మొత్తాలను దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్‌లలో పెట్టుబడిగా పెట్టింది. దీని వల్ల తక్కువ వడ్డీలు ఉండడమే గాక, ఆ మొత్తాలు ఐదు నుండి 10 ఏళ్ళ తర్వాతనే వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా తీసుకోవాలంటే భారీ నష్టం ఎదురవుతుంది. మరోవంక, బ్యాంకులో డిపాజిట్లు అన్ని ఒకటి లేదా రెండేళ్లకు మాత్రమే దాదాపుగా ఉంటాయి. బ్యాంకు ఆర్ధిక స్థిరత్వం సన్నగిల్లిన్నట్లు గమనించి డిపాజిట్ చేసిన వారు తమ డిపాజిట్‌లను ఒకేసారి ఉపసంహరించుకునే ప్రయత్నం చేయడంతో కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి కరోనా సంక్షోభ కాలంలో సహితం ఎస్‌విబి తన వ్యాపారాన్ని విశేషంగా పెంచుకుంది. 2020లో ఈ బ్యాంకులో డిపాజిటర్లు చేసిన ఫిక్సిడ్ డిపాజిట్ల మొత్తం 61.70 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2021లో అది కాస్తా 189.20 బిలియన్ డాలర్లకు పెరిగింది.2022లో టెక్ కంపెనీల్లో సంక్షోభం చెలరేగడంతో బ్యాంకు నుండి డిపాజిట్ల ఉపసంహరణలు పెరిగిపోతూవచ్చాయి. దాంతో లిక్విడిటీని పెంచుకునే దిశలో బాండ్లను నష్టానికి ఉపసంహరించుకోవలసి వచ్చింది. అంటే 21 బిలియన్ డాలర్లకు బదులు ఎస్‌విబికి దక్కింది 1.8 బిలియన్ డాలర్ల నష్టమే.

ఈ నష్టాన్ని కవర్ చేయడానికి మరో 2.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మడానికి సిద్ధం కావడంతో ఈ బ్యాంకు కుప్పకూలే ప్రమాదం ఏర్పడిందనే భయంతో డిపాజిట్ దారులు ఒకేసారి తమ డిపాజిట్‌లను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. దానితో బ్యాంకు కుప్పకూలిపోక తప్పలేదు. ఈ అనుభవాలు భారత ప్రభుత్వానికి, బ్యాంకులకు సహితం ఓ గుణపాఠంగా ఉండాలి. కేవలం బ్యాంకులను కాపాడటం కోసం లక్షల కోట్ల రూపాయల బడా కార్పొరేట్ల రుణాలను రద్దు చేయడం, ప్రభుత్వమే బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చే ప్రయత్నం మన దేశంలో జరుగుతున్నది. మరోవంక రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుకుంటూ వస్తున్నది.

బ్యాంకుల నుంచి రుణాలకు డిమాండ్ తగ్గుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరించిన బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ విధానాలు బ్యాంకింగ్ రంగానికి ముప్పుగా పరిణమించాయి. అసమర్ధతకు పేరొందిన బ్యాంకులను కాపాడటం కోసం సమర్ధవంతంగా పని చేస్తున్న బ్యాంకులను వాటితో విలీనం కావించిన కారణంగా తాత్కాలికంగా స్థిరత్వం కనిపించినా, ఆచరణలో అనేక దుష్ఫలితాలకు దారితీస్తుంది. మరోవంక, పెద్ద ఎత్తున బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రజల నుండి ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటన కారణంగా ప్రస్తుతం నిలిపివేసిన ప్రభుత్వం అందుకు ఇంకా కట్టుబడి ఉంది. ఇటువంటి పరిణామాలు సమీప భవిష్యత్తులో కొన్ని బ్యాంకులు కుప్పకూలేందుకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పలువురికి కీలక వ్యక్తుల అండదండలు కొనసాగుతున్న కారణంగానే వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు దర్యాప్తు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు చెప్పుకోదగిన ఫలితాలు సాధించడం లేదు. అమెరికా వంటి దేశాలు సహితం ఇటువంటి రుణాలు ఎగగొట్టి పారిపోయిన వారిని రప్పించడం కోసం రాజకీయ, దౌత్యపరమైన మార్గాలను అనుసరిస్తుంది. కానీ మన ప్రభుత్వం అనుసరించకపోవడం గమనార్హం. సెబి వంటి నియంత్రణ వ్యవస్థలను బలోపేతం కావించడంతో పాటు బ్యాంకుల ఉన్నతాధికారులను తమ బ్యాంకులలో జరిగే అక్రమాలు, రుణాల గోల్‌మాల్ లకు బాధ్యులను కావించాలి.

జీవిత బీమా సంస్థ వంటి ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక సంస్థలు ఇటీవల కాలంలో ఆటుపోట్లను ఎదుర్కోవలసి రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఆర్ధిక విధానాలలో పారదర్శకత లోపించడం మన దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. అదానీ ఆస్తులు సగానికి కుప్పకూలిపోవడం కారణంగా మన ఆర్ధిక సంస్థలు, బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఇంతకాలం విదేశాలలోని పలు బినామీ కంపెనీల ద్వారా కృత్రిమంగా ఆస్తులు పెంచుకొని, ఆర్ధిక సంస్థలు, బ్యాంకుల నుండి భారీగా పెట్టుబడులు, రుణాలు తీసుకున్నట్లు వెల్లడైంది. ఇటువంటి దారుణమైన పరిణామాలపై సుప్రీంకోర్టు చొరవ తీసుకొని విచారణకు ఆదేశించడం హర్షదాయకం. కానీ ప్రభుత్వం కనీసం చర్చకు సహితం సిద్ధం కాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News