Monday, December 23, 2024

నిర్దేశిత ప్రభుత్వ లక్షాలను బ్యాంకర్లు పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: నిర్దేశిత ప్రభుత్వ లక్షాలను బ్యాంకర్లు నిబంధనల మేరకు ప్రణాళికబద్దంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటి సమావేశంలో ఆయన పాల్గొని సమీక్షించారు.

గత ఆర్థిక సంవత్సరంలో రూ.1672 కోట్ల పంట రుణ లక్షానికి రూ.1280 కోట్లు, 391 కోట్ల వ్యవసాయ టర్మ్ రుణాలకు రూ.638 కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు తెలిపారు. పంట రుణ లక్ష సాధనలో రూ.82.56 శాతం సాధించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణ సౌకర్యం కల్పించే దిశగా వ్యవసాయ విస్తరణ అధికారులతో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

అలాగే రైతుల రుణాలపై బ్యాంకు వారిగా కలెక్టర్ సమీక్ష జరిపారు. కెనరా బ్యాంకు, డీసీబీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తక్కువ పంట రుణాల పంపిణీ కారణాలను వివరాలు కోరారు. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రయారిటీ సెక్టార్ కింద జిల్లాలో రూ.3,261 కోట్ల లక్షానికి గాను రూ.4,031 కోట్ల రుణం అందించామని, 123.64 శాతం మేర లక్షం సాధించామని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి నాటికి 812 స్వశక్తి సంఘాలకు రూ.50 కోట్లు, మెప్మా కింద 32 సంఘాలకు రూ.3.11 కోట్లు బ్యాంకు రుణాలు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

జూన్ చివరి నాటికి నిర్దేశించిన లక్షాలలో 78.51 శాతం పూర్తి చేశామన్నారు. జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో 756 స్వశక్తి సంఘాలు రూ.3.70 కోట్లు, పట్టణ ప్రాంతంలోని 205 స్వశక్తి సంఘాలకు రూ.2.68 కోట్లు ఎన్‌పీఏ ఉందని అధికారులు వివరించారు. జూలై చివరి నాటికి ఎన్‌పీఏ ఒక శాతం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

పట్టణ ప్రాంతంలో స్వశక్తి మహిళ సంఘాలకు ఎన్‌పీఏ అధికంగా ఉందని, దీనిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, రుణ రికవరిపై ప్రత్యేక శ్రద్ద వహించి ప్రతి రోజు నివేదిక తెలుపాలని అదనపు కలెక్టర్ సచించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల క్రింద యువతకు రుణాలు అందించాలన్నారు. స్టాండ్ అప్ ఇండియా క్రింద ఇప్పటి వరకు 84 యూనిట్లకు 1649 కోట్ల రుణాలు మంజూరు చేసి 470 మందికి ఉపాధి కల్పించామని, ముద్ర రుణాల కింద ఈ సంవత్సరం జూన్ చివరి నాటికి 2,927 మంది లబ్దిదారులకు రూ.18.38 కోట్లు అందించామని తెలిపారు.

యువతకు ఉపాధి కల్పించే విషయంలో అధికారులు చొరవ చూపాలని అన్నారు. అనంతరం 2023, 24కు సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక వివరాలు తెలిపారు. వ్యవసాయ రంగంలో పంట రుణాలు రూ.1854 కోట్లు, టర్మ్ రుణాలు రూ.330 కోట్లు, వ్యవసాయ సౌకర్యాల కల్పనకు రూ.49 కోట్లు, ఇతర వ్యవసయ పనులకు రూ.409 కోట్లు, పరిశ్రమలకు రూ.485 కోట్ల, ఇతర ప్రయారిటీ సెక్టార్ కింద రూ.130 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్ రూ.323 కోట్ల మొత్తంతో రూ.3,582.95 కోట్ల రుణం అందించాల్సిందిగా వార్షిక ప్రణాళిక రూపొందించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, వివిధ బ్యాంకు మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News