Wednesday, January 22, 2025

‘యమ’బ్యాంకర్లు

- Advertisement -
- Advertisement -

రైతులకు రుణాలివడానికి సవాలక్ష షరతులు తీర్మానాలు చేస్తారు-అమలు చేయరు ప్రభుత్వ లక్షాలను నీరుగారుస్తున్న బ్యాంకర్లు ప్రభుత్వం హామీలను పట్టించుకోని బ్యాంకర్లు
నామ్‌కేవాస్తీగా మారిన ఎస్.ఎల్.బి.సీ. తీర్మానాలు బ్యాంకర్ల పనితీరు సమీక్షలో ప్రధాన ఎజెండా

మన తెలంగాణ / హైదరాబాద్ : వ్యవసాయ రంగం, రైతాంగం పట్ల చిన్నచూపు చూస్తున్న బ్యాంకుల పనితీరుపైన కూడా అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రైతన్నలకు పంటల సాగుకు రుణాలు ఇవ్వాలన్నా, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, ఇతరత్రా యంత్రాలకు రుణాలు ఇవ్వడానికి సవాలక్ష షరతులు విధిస్తూ వేధింపులకు గురి చేస్తున్న రాష్ట్రంలోని బ్యాంకుల వ్యవహార శైలిని కూడా హై లెవెల్ కమిటీ అధ్యయనం చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. బ్యాంకుల పనితీరు పరిశీలనకు ఆర్ధికశాఖాధికారులు, బ్యాంకర్ కమిటీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీకి వ్యవసాయ రంగం, రైతాంగాన్ని బ్యాంకులు వేధిస్తున్న అంశాలను కూడా చేర్చాలని నిర్ణయించినట్లుగా ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ఎందుకంటే ప్రతి ఏటా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్.ఎల్.బి.సి) సమావేశంలో భారీగా పంట రుణాలు ఇవ్వాలని తీర్మానం చేసుకుంటున్నామే గానీ ఆచరణలో మాత్రం బ్యాంకర్లు 70 శాతం నిధులు కూడా రైతులకు రుణాలుగా ఇవ్వడంలేదని సీనియర్ అధికారులు అంటున్నారు.

2021-22వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణలోని రైతాంగానికి సుమారు 64 వేల కోట్ల రూపాయలను పంటలసాగుకు రుణాలుగా ఇవ్వాలని ఎస్.ఎల్.బి.సి. సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామని, కానీ ఆచరణలో అందులో కేవలం 70 శాతం రుణాలనే ఇచ్చారని, అందులోనూ రెన్యువల్స్ అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రతి ఏటా 30 శాతం నిధులను ఇవ్వడంలేదని తెలిపారు. వ్యవసాయ రంగానికి, రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి బ్యాంకర్ల నిర్వాకాలు తలనొప్పిగా మారిందని ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. పట్టాదారు రైతులు, కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తాము రైతుల పక్షాన అండగా ఉంటామని ప్రతి ఎస్.ఎల్.బి.సీ. సమావేశంలో ప్రభుత్వం బ్యాంకర్లకు హామీలు, గ్యారెంటీలు ఇస్తూనే ఉన్నప్పటికీ బ్యాంకర్లు పట్టించుకోకపోవడంతో ఈ సమీక్షకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు, రైతాంగ సంక్షేమానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఎకనమిక్ యాక్టివిటీని భారీగా పెంచాలనే తెలంగాణ ప్రభుత్వం లక్షాలకు బ్యాంకర్లు గండి కొడుతున్నారని కొందరు అధికారులు సైతం మండిపడుతున్నారు.

బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణకు ప్రభుత్వం పూనుకొందని ఆ అధికారులు వివరించారు. ఇక జీరో వడ్డీ పథకాన్నే బ్యాంకర్లు సరిగ్గా అమలు చేయడంలేదని అనేక ఫిర్యాదులు కూడా వచ్చారని ఆ అధికారులు వివరించారు. దీంతో మళ్ళీ రైతన్నలు బంగారాన్ని బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు పొందుతున్నారని, లేకుంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి, వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొంటున్నారని, సూక్ష్మ వడ్డీల ఊబిలో కూరుకుపోతున్నారని ఆ అధికారులు వివరించారు. బంగారాన్ని కుదువపెట్టి రుణాలను పొందడంలోనూ రైతన్నలు బ్యాంకుల నుంచి భారీగా దోపిడీకి గురవుతున్నాయనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయని ఆ అధికారులు వివరించారు. బంగారంపైన ఇచ్చే రుణాలపై సర్వీసు చార్జి, జి.ఎస్.టి, అప్రైజల్ చార్జీల పేరుతో బ్యాంకర్లు రైతుల నుంచి భారీగానే వసూళ్ళు చేస్తున్నారని వివరించారు. బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక లక్ష రూపాయలను రుణంగా పొందాలంటే 400 నుంచి 500 రూపాయల వరకూ సర్వీస్ చార్జి, అప్రైజల్ చార్జిల పేరుతో వసూలు చేస్తున్నారని, ఇదంతా ఒక్క ఏడాదికేనని, రెండో సంవత్సరానికి ఈ రుణాలను రెన్యువల్ చేయడానికి కూడా మళ్ళీ సర్వీసు చార్జి, అప్రైజల్ చార్జీలను కూడా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని ఆ అధికారులు వివరించారు.

సర్వీస్ చార్జీలు, జి.ఎస్.టి, అప్రైజల్ చార్జీల పేరుతో ఒక లక్ష రూపాయలను రుణంగా తీసుకుంటే బ్యాంకు నిబంధనల ప్రకారం వడ్డీలు 6,500 రూపాయలను వసూలు చేయాల్సి ఉందని, కానీ మెజారిటీ బ్యాంకులు రైతుల నుంచి ఒక లక్ష రూపాయల రుణానికి ఏడాదికి వడ్డీలు, చార్జీల రూపంలో 7,500 రూపాయలను వసూలు చేస్తున్నారని ఆ అధికారులు వివరించారు. బంగారంపై రుణం తీసుకునే మొదటి సంవత్సరానికి చార్జీలు వసూలు చేయాలేగానీ, రుణాల రెన్యువల్స్ కూడా చార్జీల పేరుతో రైతుల నుంచి భారీగా నిధులను వసూలు చేస్తున్నారని వివరించారు. వాస్తవానికి రుణాలను తీసుకునే రైతుల నుంచి పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, నివాస ధృవప్రతాలు, పాన్ కార్డులు, ఆధార్ తదితర వందపేజీలకు పైగా డాక్యుమెంట్, దాదాపు 30 సంతకాలతో కూడా భారీ డాక్యుమెంట్‌ను తయారు చేసుకొని పంట రుణాలను ఇస్తుంటారని, ఈ డాక్యుమెంట్లలోని షరతులన్నీ ఇంగ్లీషు, హిందీ భాషలో కనపడని అక్షరాలతో ఉంటాయని, ఆ షరతులన్నీ తనఖా పెట్టిన పొలంపై సర్వహక్కులు, అధికారాలు బ్యాంకులకే కట్టబెడుతున్నట్లుగా ఉంటాయని వివరించారు.

రైతన్నలు అవేమీ చదవకుండానే, చదవడానికి వీల్లేని విధంగా ఉంటాయని, సూక్ష్మ వడ్డీల వ్యాపారుల బాధలు భరించలేక బ్యాంకులు పెట్టే షరతులన్నింటికీ రైతులు గుడ్డిగా సంతకాలు చేస్తుంటాయని, అయినప్పటికీ బ్యాంకులు రైతన్నలు, వ్యవసాయ రంగాన్ని చిన్నచూపే చూస్తున్నాయని, ఈ ధోరణుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా హై లెవెల్ కమిటీ ఆ మూలాగ్రం అధ్యయనం చేసి సరికొత్త నియమ, నిబంధనలను రూపొందించాలని, రాష్ట్రంలో కార్యకలాపాలు సాగించే బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, అవసరాలు, రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలే గానీ సూక్ష్మ వడ్డీ వ్యాపారుల మాదిరిగా బ్యాంకులు వ్యవహరించకుండా నిరోధించాలని ఆ అధికారులు హై లెవెల్ కమిటీని కోరుతున్నారు. ఈ పరిస్థితులపై ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు సారధ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ ఎలా అధ్యయం చేస్తుందో, ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసులు చేస్తుందో వేచి చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News