తగ్గిన రూ.100 కోట్లకు పైన కుంభకోణాలు
202122లో రూ.41 వేల కోట్లకు
న్యూఢిల్లీ : దేశంలో బ్యాంకింగ్ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ.100 కోట్లకు పైగా మోసాల్లో తగ్గుదల గణనీయంగా ఉంది. 2020-21లో రూ.1.05 లక్షల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణాలతో పోలిస్తే 2021-22 సంవత్సరంలో రూ.41 వేల కోట్లకు తగ్గాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ బ్యాంకుల్లో మోసాల సంఖ్య 2020-21లో 265 నుంచి 2021-22లో 118కి పడిపోయింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.100 కోట్లకు పైన ఉన్న మొత్తం మోసాల కేసులు 167 నుంచి 80కి తగ్గగా, ప్రైవేటురంగ బ్యాంకుల్లో 98 నుంచి 38కి పడిపోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు మొత్తం విలువ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.65,900 కోట్ల నుంచి 2021-22లో రూ.28 వేల కోట్లకు పడిపోయాయి. ప్రైవేటు బ్యాంకుల్లో మోసాల విలువ రూ.39,900 కోట్ల నుంచి రూ.13,000 కోట్లకు తగ్గాయి.
మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బిఐ అనేక చర్యలు చేపట్టింది. ఇడబ్లుఎస్(ఎర్లీ వార్నింగ్ సిస్టమ్) వ్యవస్థ, ఫ్రాడ్ గవర్నెన్స్ బలోపేతం, రెస్పాన్స్ సిస్టమ్ వంటివి రిజర్వు బ్యాంకు తీసుకొచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అతిపెద్ద బ్యాంకింగ్ స్కామ్ ఎబిజి షిప్ యార్డ్ (రూ.22,842 కోట్ల మోసం) ఎస్‌బిఐ బయటపెట్టింది. ఇది నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ మోసం కంటే అత్యంత పెద్ద కుంభకోణంగా మిగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నీరవ్ మోడీ మోసం విలువ రూ.14 వేల కోట్లు ఉంది. అయితే గతవారం సిబిఐ కేసు బుక్ చేసిన డిహెచ్‌ఎఫ్‌ఎల్(దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) మోసం దేశ చరిత్రలోనే అత్యంత పెద్దది అని రుజువైంది. డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, దీరజ్ వాధ్వాన్‌లు దాదాపు రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడ్డారని సిబిఐ ప్రకటించింది.