Saturday, November 23, 2024

సంక్షోభంలో బ్యాంకింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికాలోలో 15 ఏళ్ల క్రితం సంభవించిన లేమాన్ బ్రదర్స్ దివాలా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేసింది. అప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ మధ్య కాలంలో వడ్డీ రేట్లను వేగంగా పెంచుకుంటూ వస్తోంది. ఈ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు ఆర్థిక మాంద్యం కూడా బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తోందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం మరింత ముదురుతోంది. అమెరికాలోని రెండు పెద్ద బ్యాంకులు సిలికాన్ వాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లకు తాళం వేశారు. ఆ తర్వాత అమెరికా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కష్టాలను ఎదుర్కొంటోంది. మరో ఐదు బ్యాంకులు కూడా దివాలా స్థితిలో ఉన్నట్టు మూడీస్ నివేదిక తెలిపింది.

రిపబ్లిక్ బ్యాంక్‌ను రక్షించేందుకు అమెరికా బ్యాంకుల సమూహం కనీసం 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌ల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ మునిగిపోతుందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ రిలీఫ్ ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నారు. జెపిఎస్ మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో, గెల్డ్‌మన్ సాచ్‌లు ప్యాకేజీ ఇచ్చే గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ని కాపాడేందుకు అమెరికా బ్యాంకుల గ్రూప్ కనీసం 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక తెలిపింది. రిపబ్లిక్ బాంక్‌కు డిపాజిట్లు, మూలధన రూపంలో 20 బిలియన్ డాలర్లు ఇచ్చే అవకాశం ఉందని, అయితే ఈ మొత్తం కూడా 30 బిలియన్ డాలర్లు కావచ్చని తెలుస్తోంది.

యూరప్‌కు పాకిన సంక్షోభం..

అమెరికన్ బ్యాంకింగ్ సంక్షోభం ఇప్పుడు యూరప్‌కు పాకింది. యూరప్‌లోని అతిపెద్ద పెట్టుబడి బ్యాంకులలో ఒకటైన క్రెడిట్ సూయిస్ ఆర్థిక ఆరోగ్యం క్షీణించగా, ఈ బ్యాంక్ పెట్టుబడిదారులు, కస్టమర్లలో ఆందోళన మొదలైంది. 2008లో అమెరికా అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన లెమాన్ బ్రదర్స్ పతనం గురించి ముందే అంచనా వేసిన రాబర్ట్ కియోసాకి కూడా క్రెడిట్ సూయిస్ ముప్పుపై ఆందోళన చెందుతున్నారు. క్రెడిట్ సూసీ ప్రమాదం ఇంకా పోలేదని అన్నారు. స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 54 బిలియన్ డాలర్ల రుణం పొందినా క్రెడిట్ సూయిస్ ప్రమాదం ఇంకా ముగియలేదని అంటున్నారు. వాల్ స్ట్రీట్ విశ్లేషకుడు కియోసాకి మాట్లాడుతూ, క్రెడిట్ సూయిస్ మొత్తం సమస్యకు మూలం బాండ్ మార్కెట్ అని అన్నారు. లెమాన్ బ్రదర్స్ విషయంలో తాను ముందే ఊహించానని, ఇప్పుడు ఆ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ అని అనుకుంటున్నానని అన్నారు.

బ్యాంకు బాండ్ మార్కెట్ కుప్పకూలుతోంది. ఈ సంక్షోభం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు కష్టతరమే, ఈ సంస్థ షేర్లు పడిపోయిన తర్వాత స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుండి 54 బిలియన్ డాలర్ల వరకు రుణం తీసుకోనున్నట్లు స్విట్జర్లాండ్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ తెలిపింది. క్రెడిట్ సూయిస్ తన ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుండి 50 బిలియన్ ఫ్రాంక్‌ల ( 53.7 బిలియన్ డాలర్లు) వరకు రుణం తీసుకునే అవకాశం ఉందని క్రెడిట్ సూయిస్ పేర్కొంది. ఈ అదనపు నగదు క్రెడిట్ సూయిస్ ప్రధాన వ్యాపారానికి, కస్టమర్లకు మద్దతు ఇస్తుంది. ఈ ప్రకటన తర్వాత గురువారం క్రెడిట్ సూయిస్ షేర్లు దాదాపు 30 శాతం పెరిగాయి. ఇటీవల అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు పతనమైన నేపథ్యంలో క్రెడిట్ సూయిస్ షేర్లు బుధవారం దాదాపు 25 శాతం పడిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News