సాయపడ్డ యష్ చోప్డా
ముంబయి: ప్రముఖ హిందీ సినీనటుడు అమితాబచ్చన్ 1990 దశకంలో ఎబిసిఎల్ అనే ఓ సంస్థను నెలకొల్పి ‘ప్రపంచ సుందరీమణుల పోటీ’ ఈవెంట్ నిర్వహించి చాలా దివాలా తీశాడు. నాడు ఏమి చేయాలో తెలియక ఆయన నానా ఇబ్బంది పడ్డాడు. అయితే ఆయన తిరిగి నిలదొక్కుకోడానికి యష్ చోప్డా సాయపడ్డారు. యష్ చోప్డా 89వ జన్మదినోత్సవం సందర్భంగా అమితాబ్ జీవితంలో మరచిపోలేని ఘట్టం గురించి…
2016లో ‘ఇండియా టుడే’ నిర్వహించిన ఓ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ “నేను ఆరంభించిన కార్పొరేషన్ నాకు అంతులేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. నేను పూర్తిగా దివాలా తీశాను. అప్పుడు స్థిమితంగా కూర్చుని ‘నేనేమి చేయాలి?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ‘నువ్వో నటుడివి. కనుక నటించు అని నా అంతరాత్మ ప్రబోధించింది. దాంతో నేను యష్జీ ఇంటికి వెళ్లి నేను పని లేకుండా ఖాళీగా ఉన్నాను. నాకు పని ఇవ్వండి” అని అడిగానన్నారు.
యూట్యూబర్ అల్లాహ్బాదీయాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఈ విషయాలను గుర్తు చేశారు.
‘నేను బోస్టన్‌లో కాలేజీ మానేశాను. ఆ కష్ట సమయంలో నా కుటుంబంతో ఉండాలనిపించింది. అయితే నేను మా నాన్నగారికి(అమితాబ్) ఏ విధంగాను సాయపడే అర్హత కలిగిలేను. దాంతో నేను కాలేజ్ వదిలేసి వెనక్కి వచ్చేశాను. నేను ఆయన కంపెనీలో సాయపడుతూ వచ్చాను” అని అభిషేక్ వివరించారు.
ఓ రోజు అర్ధరాత్రి అభిషేక్‌ని అమితాబ్ పిలిచి ‘నా సినిమాలు ఆడడంలేదు. నా బిజినెస్ సరిగా పనిచేయడంలేదు. ఏదీ కలిసి రావడంలేదు’ అని చెప్పి…ఆయన తిరిగి తన మూలాలకు(బేసిక్స్‌కు) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆయన యష్ చోప్డా ఇంటికి వెళ్లి , “నాకు పని లేదు. ఇప్పుడు నాకు ఎవరూ పని ఇవ్వడంలేదు. నా సినిమాలు కూడా సరిగా ఆడడంలేదు. నేనిప్పుడు మీ దగ్గరికి సినిమాలో పనిచేయడానికి అవకాశం ఇవ్వమని అడగడానికి వచ్చాను’ అనిఅడిగారని అభిషేక్ బచ్చన్ వివరించారు.
ఆ తర్వాత యష్ చోప్డా తన కుమారుడు ఆదిత్య చోప్డా డైరెక్ట్ చేసిన ‘మొహబతే’ అనే సినిమాలో అమితాబచ్చన్‌కు అవకాశం ఇచ్చారు. తర్వాత అమితాబ్ ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ అనే గేమ్‌షో నిర్వహించేందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి వెనక్కి చూసుకోవడం అంటూ జరగలేదు. ముందుకే దూసుకుపోయారు. యష్ చోప్డా చాందినీ, లమ్హే, దిల్ తో పాగల్ హై, వీర్ జార తదితర ప్రముఖ సినిమాలు నిర్మించారు. ఆయన చివరి సినిమా ‘జబ్ తక్ హై జాన్’.