Tuesday, November 5, 2024

సైబర్ భద్రతపై బ్యాంకులు దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -
Banks should focus on cyber security: CP CV Anand
అన్ని బ్యాంక్‌లు ఫైర్ వాల్ ఏర్పాటు చేసుకోవాలి
రిజర్వు బ్యాంక్ అధికారులతో సమావేశం
మహేష్ బ్యాంక్ కేసుతో
సమావేశమైన హైదరాబాద్ సిపి సివి ఆనంద్

హైదరాబాద్: అన్ని బ్యాంక్‌లు సైబర్ సెక్యూరిటీపై జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. స్థానిక రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, 51 పట్టణ సహకార బ్యాంక్‌ల అధికారులతో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో రిజర్వు బ్యాంక్ రిజనల్ డైరెక్టర్ శ్రీమతి నిఖిల, ఆర్బి సిజిఎం రాజన్, నాబార్డ్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ మహేష్ బ్యాంక్ సరైన ఫైర్ వాల్ సిస్టంను ఏర్పాటు చేసుకోకపోవడం వల్లే సైబర్ నేరస్థులు రూ.12.48 కోట్లు కొట్టేశారని తెలిపారు. రెండు నెలలు సుధీర్ఘంగా దర్యాప్తు చేసి నైజీరియాకు చెందిన నలుగురు నేరస్థులతోపాటు 23మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సైబర్ నేరస్థుల వద్ద నుంచి రూ.3కోట్లు రికవరీ చేశామని తెలిపారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ కలిగే ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని కోరారు.

మహేష్ బ్యాంక్ కేసులో ఫిషింగ్ మేయిల్, ట్రోజన్స్, కీ లాగర్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా బ్యాంక్ ప్రధాన డేటాబేస్‌లోనికి ప్రవేశించి హ్యాకింగ్ చేశారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో కీలకమైన ఫైర్‌వాల్ వ్యవస్థ, యాంటీ ఫిషింగ్, వర్చువల్ లాన్స్ వంటి సైబర్ సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వీటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల అపరిచిత మాల్వేర్‌లు ప్రవేశాలను నియంత్రించవచ్చని తెలిపారు. సైబర్ సెక్యూరిటీకి అవసరమైన నిధులు కేటాయించకపోవడం, నిర్వాహణ లోపాలు, కామన్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ వల్ల మహేష్ బ్యాంక్ డబ్బులు పోయాయని తెలిపారు. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన వారి నగదును పరిరక్షించడంతోపాటు కస్టమర్లకు రక్షణాత్మకమైన ఆన్‌లైన్ సేవలను అందించడం బ్యాంక్‌ల బాధ్యతని, దీనిలో విఫలమైన బ్యాంక్‌లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సైబర్ భద్రత విషయంలో సరైన ప్రమాణాలు పాటించని బ్యాంక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్బిఐ అధికారులను కోరారు. భవిష్యత్ ఇలాంటి సంఘనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు బ్యాంక్‌లు చేస్తున్న ఖర్చు నామమాత్రంగా ఉందని తెలిపారు. సైబర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందులో అన్ని స్థాయిల అధికారులు పాల్గొనాలని సూచించారు. ముందుగానే సమస్యను గుర్తించి పరిష్కరించుకోవాలని తెలిపారు. దీనిపై స్పందించిన ఆర్బిఐ అధికారులు దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీని మెరుగు పరిచి, సైబర్ నేరాలను నియంత్రించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ సిట్, క్రైమ్స్ ఎఆర్ శ్రీనివాస్, జాయింట్ పోలీస్ కమిషనర్ సిసిఎస్ గజారావు భూపాల్, ఆర్బిఐ, నాబార్డ్ అధికారులు, 51 అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌ల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News