Thursday, January 23, 2025

ఘరానా దోపిడీ!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: గత ఐదేళ్ళలో బ్యాంకులు రూ. 10 లక్షల కోట్లకు పైగా తిరిగి రాని అప్పులను నిరర్థక ఆస్తులుగా పరిగణించి పక్కన పెట్టినట్టు (రైటాఫ్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు తెలియజేసిన సమాచారం కూటికి, గుడ్డకు కురచై అఘోరిస్తున్న దేశ సామాన్య జనాన్ని వెక్కిరిస్తున్నది. వృద్ధులకు రద్దు చేసిన రైల్వే పాసులను పునరుద్ధరించలేమని పదే పదే చేతులెత్తేస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం బ్యాంకులను దోచుకొంటున్న ఘరానా ఎంత ప్రేమ పూర్వకంగా చూస్తున్నదో బోధపడుతున్నది. ఇలా పక్కన పెడుతున్న ఎన్‌పిఎల స్థానంలో బ్యాంకులకు మళ్ళీ ఎక్కిస్తున్న నగదు రక్తం దేశ ప్రజల నుండి పిండుతున్న పన్ను ఆదాయం నుంచే వెళుతున్న సంగతిని దాచిపుచ్చజాలరు.

సాధారణ ప్రజల ఓటు బలం మీద అధికారానికి వచ్చే ప్రభుత్వాలు వారి నోట్లో మట్టి కొట్టే ఘన కార్యాల నిర్వహణలో నిమగ్నం కావడం అత్యంత బాధాకరం. కాకులను కొట్టి గద్దలకు వేసే క్రూర క్రీడలో నాటి యుపిఎ ప్రభుత్వం, నేటి ఎన్‌డిఎ ప్రభుత్వం ఒకదానికొకటి తీసుపోవు. అయితే 201415 నుంచి 201920 మధ్య ఎన్‌డిఎ ప్రభుత్వ హయాం లో పేరుకుపోయిన పబ్లిక్ రంగ బ్యాంకుల ఎన్‌పిఎలు రూ. 18.28 లక్షల కోట్లు కాగా, 200809 నుంచి 201314 మధ్య యుపిఎ హయాంలో పోగుపడిన ఎన్‌పిఎలు రూ. 5 లక్షల కోట్లేనని రిజర్వు బ్యాంకు తెలియజేసింది. అంటే ఎన్‌పిఎలను రద్దు చేయడంలో యుపిఎ కంటే ఎన్‌డిఎ మూడు రెట్లు ఎక్కువ ఘనతను మూటగట్టుకొన్నది.

గత ఆరేళ్ళలో పబ్లిక్ రంగ బ్యాంకులు రూ. 6,83,388 కోట్ల ఎన్‌పిఎలను రద్దు చేయగా, 2008 నుంచి 2014 వరకు యుపిఎ రద్దు చేసిన ఎన్‌పిఎల విలువ రూ. 32,109 కోట్లు మాత్రమే. ఒక వైపు ఈ అప్పులను ఇంత భారీ స్థాయిలో రైటాఫ్ చేస్తుంటే ఇంకో వైపు అంతకు మించి కొత్త ఎన్‌పిఎలు పేరుకుపోతున్నాయి. అంటే బ్యాంకులు ఎప్పటికీ గుణపాఠం నేర్చుకోలేని మొద్దు అబ్బాయిల్లా ప్రభుత్వం చంక ఎక్కి కూర్చుంటున్నాయని బోధపడడం లేదా? వాటిని క్రమ శిక్షణలో పెట్టడానికి కేంద్ర పాలకులకు ఎందుకు మనస్కరించడం లేదు? తమకు భారీ ఎత్తున ఎన్నికల విరాళాలిస్తున్న కార్పొరేట్ కంపెనీల యజమానులను మేపడం మానుకొనే సదుద్దేశం ఏ కోశానా లేకనేకదా! ఎన్‌డిఎ ప్రభుత్వం 201415 నుంచి 201920 వరకు రైటాఫ్ చేసిన రూ. 18.28 లక్షల కోట్ల ఎన్‌పిఎ విత్తం దేశంలోని సామాన్య ప్రజల బాగుకు ఎంతో ఉపయోగపడేది. రైతుల రుణ మాఫీకి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తగినన్ని నిధులు కేటాయించడానికి, సాధారణ ప్రజల గృహ నిర్మాణానికి తదితరాలకు ఈ నిధులు ఎంతగానో అక్కరకు వచ్చేవి.

ఈ ఏడాడి మేలో 3.07 కోట్ల కుటుంబాలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని కోరగా, ఆ పథకానికి నిధుల కేటాయింపును ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం భారీగా కోత కోసింది. స్వల్ప వ్యయంతో పేదలకు ఉచితాలు ఇవ్వడాన్ని బాహాటంగా వ్యతిరేకించే ప్రధాని మోడీ వాటిని రద్దు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అదే సమయంలో అత్యంత సంపన్నులైన బడా కార్పొరేట్ పారిశ్రామిక వేత్తలకు కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా ఏడాదికి రూ. 1.45 లక్షల కోట్ల మేలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి వారు తీసుకొంటున్న రుణాలను చూసీచూడనట్టు వదిలేసి వారికి వల్లమాలిన జల్సా నేర్పుతున్నారు. మరో వైపు సామాన్యులు ఎటిఎంల నుంచి డబ్బు ఉపసంహరించుకొనే ప్రతి ఒక్కసారి వారిపై పన్ను వసూలు చేస్తున్నారు.

అలాగే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్సు ఉంచకపోయినా వారి జేబులు కత్తిరిస్తున్నారు. ప్యాక్డ్ పేరుతో పాలు, పెరుగు మీద కూడా జిఎస్‌టి రుద్దుతున్నారు. ఎన్‌పిఎలు ప్రైవేటు బ్యాంకుల్లో కంటే పబ్లిక్ రంగ బ్యాంకుల్లోనే మితిమించి తేలుతుండడాన్ని గమనించాలి. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో ప్రజలు దాచుకొనే ద్రవ్యం పట్ల ఆ బ్యాంకుల పైస్థాయి సిబ్బంది బాధ్యతగా వ్యవహరించకపోడం, రుణాలు తీసుకొనే వారితో కుమ్మక్కై సరైన హామీలను రాబట్టకపోడం ఆ రుణాలు ఎన్‌పిఎలుగా మారిపోడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. అటువంటి సిబ్బంది నేరాలు రుజువై శిక్షలు పడేసరికి ఏళ్ళూపూళ్లూ పట్టిపోతున్నాయి. ప్రజలు ఎంతో నమ్మకంతో దాచుకొనే డబ్బును రుణ వితరణ కింద దుర్వినియోగం చేసే హక్కు, అధికారం బ్యాంకు అధికారులకు లేవు. అదే సమయంలో ఎన్‌పిఎలను పక్కన పెట్టి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రజా ధనంతో మేపే పద్ధతిని కొనసాగించడం మన వంటి పేద దేశాలలో ఎంత మాత్రం సమర్థించదగిన విధానం కాదు. ఎన్‌పిఎల వసూలు కోసం ఏర్పాటు చేసిన ‘బ్యాడ్’ బ్యాంకు వల్ల ఇంత వరకు చెప్పుకోదగిన ప్రయోజనం కలగలేదు. ముందు ముందు కలుగుతుందన్న ఆశలూ లేవు. ఇక్కడ బ్యాంకులను దోచుకొని విదేశాల్లో కులుకుతున్న విజయ మాల్యా, నీరవ్ మోడీ వంటి వారిని తిరిగి రప్పించడమూ పాలకులకు చేతకడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News