కామారెడ్డి : బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బీర్కూరు మండలం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బాన్సువాడ పట్టణంలోని సరస్వతి దేవాలయం ఫంక్షన్ హాల్ లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు వచ్చే శాసనసభ ఎన్నికలలో ఎంఎల్ఏగా నేనే పోటీలో నిలబడతానని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎల్లప్పుడూ సమీక్ష అవసరమన్నారు. అప్పుడే తప్పు ఒప్పులు, లోతుపాతులు బయటకు వస్తాయి. ప్రజాప్రతినిధులు, నాయకులలో ఎవరు తప్పు చేసినా అది ప్రజలలో వ్యతిరేఖతకు దారి తీస్తుంది. మంచి చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారు, తప్పు చేస్తే తరిమికొడతారు. తప్పులు చేయకపోతే బయపడాల్సిన పనిలేదు. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే సమర్ధవంతంగా తిప్పి కొట్టండి, మీ వెనక నేను ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
వాటిని సరిదిద్దుకుని మనం మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి ఈ సమీక్ష సమావేశాలు అవసరమన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో మంచి పేరు ఉన్నది. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, నాయకులు సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. క్షేత్ర స్థాయిలో పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడంలో గ్రామ స్థాయిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు కీలకమన్నారు. గ్రామ స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా మనస్పర్థలకు ఆస్కారం ఉండదు. ఏకపక్ష నిర్ణయాలు వద్దు. తెలంగాణ రాష్ట్రానికి పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రి ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టితో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కోసం కావలసినన్ని నిధులను మంజూరు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక తయారు చేసుకోవాలి. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.