Sunday, January 19, 2025

జడ్జీల పదవీ విరమణ వయసు పెంపుపై బార్ కౌన్సిల్ తీర్మానం

- Advertisement -
- Advertisement -

Bar Council Resolution on Increase in Retirement Age of Judges

న్యూఢిల్లీ : న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది. ఈమేరకు రాజ్యాంగంలో తక్షణ సవరణలు కోరుతూ తీర్మానం రూపొందించారు. ఇటీవల రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, హైకోర్టు బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు. దాన్ని 65 ఏళ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానించినట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయసును 67 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది. ఈ తీర్మానాన్ని త్వరలోనే ప్రధాన మంత్రి, న్యాయశాఖకు పంపనున్నట్టు బీసీఐ తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ కూడా జడ్జీల పదవీ విరమణ వయసును పెంచాలని అభిప్రాయపడిన విషయం తెలిసిందే. “ఎవరైనా రిటైర్ అవడానికి 65 ఏళ్లు చాలా చిన్న వయసు అని నేను అనుకుంటున్నా” అని ఆయన అన్నారు. అటు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా పలుమార్లు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు పెంపును సమర్థించారు. తొలినాళ్లలో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం కాగా, 1963 అక్టోబర్ నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఈ వయసును 65 ఏళ్లకు పెంచే ఉద్దేశంతో 2010 ఆగస్టు 25న లోక్‌సభలో 115 వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే ఆ బిల్లు పాస్ కాలేదు. ఆలోపు 15 వ లోక్‌సభ పదవీకాలం ముగిసిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News