న్యూఢిల్లీ: అడ్వకేట్ చట్టంలోని 35వ సెక్షన్ కింద లాయర్లపై వచ్చిన ఫిర్యాదులను ఏడాదిలోగా పరిష్కరించాలని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అంతేకాక తనకు బదిలీ అయిన ఫిర్యాదులను ఆ ఫిర్యాదులు అందిన తేదీనుంచి ఏడాది లోగా పరిష్కరించాలని కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అరుదైన సందర్భాల్లో సరయిన కారణాలున్నప్పుడు మాత్రమే ఫిర్యాదులను రాష్ట్రంనుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేయాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బివి నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అడ్వకేట్ చట్ట కింద న్యాయవాద వృత్తి నిజాయితీని పరిరక్షించాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర బార్ కౌన్సిళ్లపైన ఉందని బెంచ్ శుక్రవారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వద్ద లెక్కలేనన్ని ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నందున ఈ సూచన చేస్తున్నట్లు కూడా బెంచ్ తెలిపింది. తన న్యాయవాది వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేదంటూ ఓ ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన క్రమశిక్షణా కమిటీ తీర్పు ఇచ్చింది. దీనిపై అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
Bar Council to dispose complaint against lawyers within a year