పర్మిట్ రూం వల్ల నష్టపోతున్నామని బార్ యజమానులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బార్‌ల చుట్టూ ఉన్న వైన్‌షాపుల్లో పర్మిట్ రూంలు ఉండటం వల్ల కస్టమర్లు బార్లకు రావడం తగ్గిపోయిందని బార్ యజమానులు ఆరోపించారు. పర్మిట్ రూంలతో బార్‌ల వ్యాపారం దెబ్బతీంటుందని, కొందరు యజమానులు బార్లు మూసివేయాల్సిన పరిస్థితిలో ఉన్నారని బార్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామాలు, బస్తీల్లో బెల్ట్ షాపుల సంఖ్య పెరగడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపించారు. జిల్లాల్లో వైన్‌షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తుండగా, హైదరాబాద్, జీహెచ్‌ఎంసి పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు అనుమతించడంపై అసోసియేషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసి పరిధిలోనూ మిగతా జిల్లాల మాదిరిగానే సమయ పరిమితిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బార్‌ల ఆదాయం తగ్గిపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతుందని బార్ యజమానులు చెప్పుకొచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బార్ యజమానులు డిమాండ్ చేశారు.