Monday, December 23, 2024

మా రక్తంలోనే ప్రజాస్వామ్యం వివక్షకు తావేలేదు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : తానైతే భారత ప్రధాని నరేంద్ర మోడీతో భారతదేశంలో ముస్లిం మైనార్టీల పరిస్థితి, హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడి ఉండేవాడినని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. భారత ప్రధానితో అధ్యక్షులు బైడెన్ దాచి దాచనట్లుగా హక్కుల విషయం ప్రస్తావిస్తే లాభం లేదన్నారు. ప్రస్తుత దశలో భారతదేశంలో హక్కుల విషయం ప్రస్తావిస్తే భారత్‌తో సంబంధాలు బెడిసి కొడుతాయని బైడెన్ భావించి ఉంటారని, అయితే తానైతే ప్రధాని మోడీకి మతపరమైన స్వేచ్ఛను కాపాడకపోతే సంబంధాల విషయంలో ఆలోచించుకోవల్సి ఉంటుందని చెప్పేవాడినని తెలిపారు. తనకు మోడీ బాగా తెలుసునని , ఇండియాలో ఎటువంటి అపశృతిపై అయినా ఆయనతో నిర్మొహమాటంగా మాట్లాడి, దారి తప్పకుండా చేసే వాడినేమో అని ఒబామా తెలిపారు.

ఒబామా ప్రకటన తరువాత ప్రధాని మోడీతో కలిసి బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పౌరుడి గౌరవమర్యాదలను పరిగణనలోకి తీసుకోవడం భారతీయ జన్యువులోనే ఉందని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. మన విజయంలో ఇదో భాగం అయి ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరిని గౌరవించడం అమెరికా డిఎన్‌లో ఉంది. ఇండియా డిఎన్‌లోనూ ఉండి ఉంటుందని తెలిపారు. ఆ తరువాత దీనిపై ఒబామా స్పందిస్తూ హిందూ మెజార్టీ దేశం అయిన ఇండియాలో ముస్లిం మైనార్టీల స్థితిగతుల గురించి, భద్రత గురించి ఏదో విధంగా అయినా బైడెన్ మాట్లాడటం బాగుందని తెలిపారు. అయితే ఏది ఏమైనా మిత్రదేశం , వ్యూహాత్మకంగా ఎంచుకుంటున్న దేశంలో మానవ హక్కుల గురించి మాట్లాడటం నిజంగానే ఎప్పుడూ చిక్కు సమస్యే అని తెలిపారు.
భారత్‌లో వివక్ష లేదు ః మోడీ
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన అరుదైన విలేకరుల సమావేశంలో ఓ అమెరికా జర్నలిస్టు ప్రధాని మోడీని భారత్‌లో మైనార్టీల పట్ల వివక్షత ఉందనే వార్తలపై ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ అటువంటిది ఏమీ లేదన్నారు, ముస్లిం మైనార్టీలపై అణచివేతలు లేవని తెలిపారు. కుల మత, తెగ లింగ భేదాలు లేకుండా చూసుకుంటున్నామని, వివక్షతలకు ఇసుమంతైనా తావు లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News