Monday, December 23, 2024

రాహుల్‌కు బరైలీ కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

ఆర్థిక సర్వేపై వ్యాఖ్యల పర్యవసానం
బరైలీ (యుపి) : లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆర్థిక సర్వేకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపి, లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జనవరి 7న తమ ముందు హాజరు కావాలంటూ బరైలీలో ఒక న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేసింది. జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుధీర్ కుమార్ శనివారం రాహుల్‌కు నోటీస్ జారీ చేశారు. అఖిల భారత హిందు మహాసంఘ్ మండల అధ్యక్షుడు పంకజ్ పాఠక్ దాఖలు చేసిన పిటిషన్‌పై సమన్లు జారీ చేయడమైంది. రాహుల్‌పై ఒక కేసు నమోదు చేయాలనే అభ్యర్థనతో పాఠక్ తొలుత ఆగస్టులో ఎంఎల్‌ఎఎంపి కోర్టు/ సిజెఎం కోర్టును ఆశ్రయించారు. అయితే. కోర్టు ఆగస్టు 27న ఆ అభ్యర్థనను తిరస్కరించింది.

దీనితో పాఠక్ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పురస్కరించుకునే రాహుల్‌కు సమన్లు జారీ అయ్యాయి. ‘బలహీన వర్గాల శాతం అధికంగా ఉన్నప్పటికీ వారి ఆస్తుల శాతం బాగా తక్కువగా ఉన్నది. ఈ పరిస్థితే కొనసాగినట్లయితే అధిక జనాభా ఉన్నవారు మరిన్ని ఆస్తులు కోరగలరు’ అని రాహుల్ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆరోపించినట్లు పాఠక్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది వీరేంద్ర పాల్ గుప్తా పిటిషన్‌లో వాదించారు. రాహుల్ ఆ వ్యాఖ్యలతో బలహీన వర్గాలను రెచ్చగొట్టే యత్నం చేశారని, ఆ వ్యాఖ్యల లక్షం ‘రాజకీయ లబ్ధి కోసం వర్గ విద్వేషం సృష్టి’ అని గుప్తా ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News