మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడు యడ్డ్యూరప్ప ప్రభుత్వంలో హోంమంత్రిగా చేసిన బసవరాజ్
బొమ్మైని వరించిన కర్నాటక ఆధిపత్యం
మళ్లీ లింగాయత్‌కే పీఠం, నేడు ప్రమాణ స్వీకారం
బెంగళూరు: కర్నాటకలో యడ్డూరప్ప రాజీనామాతో కొత్త వారసుడు ఎవరనే ఉత్కంఢకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. మంగళవారం సాయంత్రం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం బొమ్మైని తమ నాయకుడిగా ఏకగ్రీంగా ఎ న్నుకుంది. కర్నాటక ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన లింగాయత్ వర్గానికే మళ్లీ సిఎం పీఠాన్ని కట్టబెడుతూ కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. బసవరాజ్ బొమ్మై ఎంపికపై బిజెపిలో ఏకాభిప్రాయం వ్యక్తంమవుతున్నట్లు తెలుస్తోంది. బొమ్మై ఎంపికలో బిజెపి అధిష్ఠానం పలు అంశాలను పరిగణనలోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి కావడమే కాకుండా యెడియూరప్పకు అత్యంత సన్నిహితుడు కూడా. వాస్తవానికి బొమ్మై పేరును ఆయనే స్వయంగా ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఉత్తర కర్నాటకకు సిఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా దీనితో నెరవేరినట్లవుతుంది. వీటన్నిటికీ మించి పాలనానుభవం, అన్ని పార్టీల నేతలతో స్నేహపూర్వక సంబంధాలు ఉండడం కూడా ఆయనకు కలిసివచ్చింది. పార్టీ పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి. కిషన్ రెడ్డిల సమక్షంలో కొత్త్త సిఎంను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న బసవరాజ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడు. కొత్త నాయకుడిగా బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా, గోవింద్ కర్జోల్, ఆర్ అశోక్, కెఎస్ ఈశ్వరప్ప, బి శ్రీరాములు, ఎస్‌టి సోయశేఖర్, పూర్ణిమా శ్రీనివాస్‌లు మద్దతు తెలియజేశారని సమావేశం అనంతరం ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డిలు మీడియాకు చెప్పారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు ప్రకటించాక 61 ఏళ్ల బొమ్మై యెడియూరప్ప ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ నేతలంతా ఆయనకు అభినందనలు తెలియజేశారు. కాగా కొత్త ముఖ్యమంత్రిగా బొమ్మై బుధవారం ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.
మూడు సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నిక
జనతాదళ్‌తో రాజకీయ ప్రవేశం చేసిన బసవరాజ్ బొమ్మై 1998,2004లో ఎంఎల్‌సిగా ఎన్నికైనారు. తర్వాత బిజెపిలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఉత్తర కర్నాటకలోని షిగ్గాన్ నియోజకవర్గంనుంచి మూడు సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. యెడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్న గౌడ పాటిల్, సిటి రవి తదితరుల పేర్లు వినిపించినా చివరికి బసవరాజ్‌నే అదృష్టం వరించింది. ఆయన గతంలో టాటా గ్రూపులో ఇంజనీర్‌గా పని చేశారు. కాగా కొవిడ్ నియంత్రణ, వరదలు, రాష్ట్ర అర్థిక పరిస్థితిని మెరుగుపరచడం తన తొలి ప్రాధాన్యతలుగా బొమ్మై చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమున్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి అహోరాత్రులు శ్రమిస్తానని ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ బొమ్మై చెప్పారు.